అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్ అయ్యింది. ఆనాటి ఆ ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాకీ, ఈనాటి ఈ ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాకీ పోలికలేమన్నా వున్నాయా.? అల్లరి నరేష్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ కథా కమామిషు ఏంటి.? తెలుసుకుందాం పదండిక.
కథ: తమ్ముడికి (రవి కృష్ణ) పెళ్ళయి, కూతురు కూడా వుంటుందిగానీ, అన్నయ్య గణ (అల్లరి నరేష్)కి మాత్రం పెళ్ళి అవదు. పెళ్ళి సంబంధాలు చూస్తుంటాడు, అర్థ సెంచరీ టచ్ చేసేస్తాడు పెళ్ళి చూపుల్లో. కానీ, పెళ్ళవదు. అనుకోకుండా ఓ అమ్మాయి పరిచయమవుతుంది గణకి. అదే అమ్మాయిని ఓ మేట్రిమొనీ సంస్థ ద్వారా కలుసుకుంటాడు. కానీ, ఇక్కడే పెద్ద ట్విస్ట్. అదేంటి.? ఆ అమ్మాయి (ఫరియా అబ్దుల్లా) ఎవరు.? అసలు, హీరో గణ కంటే ముందు తమ్ముడికి పెళ్ళి ఎందుకయ్యింది.? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటులు..
అల్లరి నరేష్ మళ్ళీ తన జోనర్‌లోకి వచ్చాడనిపిస్తుంది. వరుసగా సీరియస్ మూవీస్ చేసి, ఇప్పుడు ట్రాక్ మార్చి, తనకు సేఫ్ జోన్ అయిన కామెడీలోకి మళ్ళీ మారాడా.? అనిపిస్తుంది. అంతలోనే, కాస్త సీరియస్ టోన్ కూడా టచ్ చేశాడు. తెరపై సరదాగా కనిపిస్తుంటే, అల్లరి నరేష్‌ని చూడాలనిపిస్తుంది. పాటల్లోనూ బాగానే కదిలాడుగానీ, మునుపటి జోష్ అయితే తగ్గింది. ఇంకొంచెం ఫన్ అల్లరి నరేష్ నుంచి దర్శకుడు రాబట్టుకుని వుంటే బావుండేది. అతని పొటెన్షియాలిటీని దర్శకుడు పూర్తిగా క్యాష్ చేసుకోలేకపోయాడు.
హీరోయిన్ కంటే ముందు, అల్లరి నరేష్ సోదరి పాత్రలో నటించిన జామీ లీవర్ గురించి మాట్లాడుకోవాలి. బాలీవుడ్ కమెడియన్ జానీ లివర్ కుమార్తె ఈమె. బాగానే చేసిందిగానీ, ఒకింత ‘అతి’ అనిపిస్తుంటుంది అక్కడక్కడా.! ఈమె పాత్రలో నిజానికి, హరితేజని తీసుకుని వుంటే రఫ్ఫాడించేసేదే.! నేటివిటీ ఫ్యాక్టర్ ఇక్కడ.
ఫరియా అబ్దుల్లా.. ఆరడుగుల ఆజానుబాహురాలు.. అన్న సంగతి తెలిసిందే. అల్లరి నరేష్‌కి జోడీగా సెట్టయిపోయిందిగానీ, హీరోయిన్‌గా ఆమెని ఆడియన్స్ అంగీకరించడం ఒకింత కష్టమే. వున్నంతలో బాగానే చేసింది. మంచి డాన్సర్ అయినా, ఆమెని ఆ కోణంలోనూ సరిగ్గా వాడుకోలేకపోయాడు దర్శకుడు.
హరితేజ ఓకే.! వెన్నెల కిషోర్, హర్ష చెముడు తదితరులు కాస్సేపు నవ్వులు పూయించారు. మిగతా పాత్రధారులంతా మమ అనిపిస్తారంతే.
సాంకేతిక నిపుణులు..
గోపీ సుందర్ మ్యూజిక్ బాగానే వుంది. పాటలు తెరపై చూడ్డానికీ బాగానే వున్నాయ్. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా వుంటే బావుండేది. నిర్మాణపు విలువలూ బావున్నాయ్. యాక్షన్ ఎపిసోడ్స్‌ని బాగానే డిజైన్ చేశారు.
మాటలు ఓకే. కానీ, అల్లరి నరేష్ సినిమా కాబట్టి, ఇంకాస్త హ్యూమర్ టచ్‌తో డైలాగులు రాసి వుండాల్సింది. జామీ లీవర్ కోసం రాసిన డైలాగులు ఓకే. ఆమె నుంచి అతి ప్రదర్శన కనిపించింది.
ప్లస్ పాయింట్స్..
- అల్లరి నరేష్ సరదాగా కనిపించడం
- హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ
మైనస్ పాయింట్స్:
- టైటిల్‌కి తగ్గ స్థాయిలో కామెడీ లేకపోవడం
- ఫ్లాట్‌గా సాగే నెరేషన్
- మేట్రిమోనీ సంస్థల మోసాల పేరుతో పీకిన క్లాస్
విశ్లేషణ
ఏం చెప్పారు.? ఏం చేశారు.? ఔను, ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా టైటిల్ అంటే, ఆ టైటిల్ వినగానే కడుపుబ్బా నవ్వేసుకుంటాం. అలాంటి టైటిల్ పెట్టి, అందులో సగం కూడా కామెడీ లేకపోతే ఎలా.? ఈ సినిమాకి అదే సమస్యగా మారిందేమో.! కాకపోతే, అల్లరి నరేష్ మునుపటిలా తెరపై చలాకీగా కనిపిస్తోంటే, ముచ్చటేస్తుంది. మేట్రిమోనీ సంస్థల ఆగడాల గురించి ప్రస్తావించిన వ్యవహారం ఎంతమందికి కనెక్ట్ అవుతుంది.? అన్నదే కీలకం ఇక్కడ. తెరపై బోల్డంత ఫన్‌కి అవకాశం వున్నా, మమ అనిపించేయడం నిరాశ కలిగిస్తుంది. కొన్ని సన్నివేశాలు సాగతీతకు గురయ్యాయి. ఫ్యామిలీతో కలిసి చూడటానికి ఇబ్బంది లేని సినిమానే అయినా, థియేటర్‌లో అంతసేపు టైమ్ పాస్ చేయడం కష్టమనిపిస్తుంది.
తెలుగు బులెటిన్ రేటింగ్: 2/5