ఉపాధ్యాయుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులను ఇకపై బోధనేతర విధుల నుంచి తప్పిస్తూ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సవరించిన నిబంధనల ప్రకారం ఇకపై ఉపాధ్యాయులు విద్యా బోధనకు సంబంధించిన అంశాలపైనే దృష్టి సారించాలని ప్రభుత్వం పేర్కొంది.
ఈమేరకు చట్ట సవరణ చేసి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వర్చువల్ కేబినెట్ ద్వారా మంత్రులకు పంపించి డిజిటల్ సంతకాలతో ఆమోదం తీసుకుంది. ఉపాధ్యాయులను బోధనేతర విధులకు వినియోగించడం నిషేధం విధించాలని నిర్భంద విద్యాహక్కు చట్టం-2009 సూచిస్తోందని నోటిఫికేషన్ లో పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ సిబ్బంది అందుబాటులో లేనప్పుడు మాత్రమే ఉపాధ్యాయుల సేవల్ని వినియోగించుకుంటామని కూడా పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి, గోరుముద్ద, విద్యా కానుక, ట్యాబ్ పంపిణీ, సీబీఎస్ఈ అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఉపాధ్యాయులకు ఈ అంశాల పర్యవేక్షణ ఉంటున్నందున వారిని బోధనేతర విధుల నుంచి తప్పిస్తున్నట్టు తెలుస్తోంది.