Morocco: శనివారం భూకంపం (Earthquake) సృష్టించిన విలయంలో మొరాకో (Morocco) అతలాకుతలమైంది. గంటలు గడుస్తున్న కొద్దీ మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఎక్కడ చూసినా కూలిన నిర్మాణాలు, నిరాశ్రయులు, క్షతగాత్రులు, ఆర్తనాదాలతో భీతావాహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కూలిన నిర్మాణాల శకలాలను వెలికితీస్తున్న కొద్దీ భారీగా మృతదేహాలు లభ్యమవుతున్నాయి.
ఆదివారం నాటికి భూకంప మృతుల సంఖ్య 2012కి చేరింది. 1404మంది గాయపడ్డారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక వార్తా సంస్థలు తెలియజేస్తున్నాయి. హై అట్లాస్ పర్వతాల దగ్గర ప్రాణ నష్టం అధికంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మారకేష్ చుట్టుపక్కల 5 ప్రావిన్సుల ప్రజలను భూకంపం భయభ్రాంతులకు గురి చేసింది.
ప్రజలు శిథిలాల నుంచే నిత్యావసరాలు తెచ్చుకున్నారు. ప్రజలు అర్ధరాత్రి కూడా వీధుల్లోనే గడిపారు. బాధితులకు పునరావాసం, ఆహారం అందించాలని కింగ్ మహ్మద్-6 ఆదేశించారు. మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. భూకంపం ధాటికి 12వ శతాబ్దానికి చెందిన చారిత్రక కటూబియా మసీదుకు తీవ్ర నష్టం జరిగిందని తెలుస్తోంది.