దేశంలో రోజురోజుకీ రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలనే రూల్ తీసుకొచ్చారు. పాటించని వారికి భారీ జరిమానాలు, లైసెన్సులు రద్దు చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. అయితే.. వాహనదారులను హెల్మెట్ పెట్టుకోకపోతే ఊరుకోని పోలీసులు కొందరు ఈ నియమాల్ని పాటించడం లేదని ఓ యువకుడు ఏకంగా పోలీసులనే ప్రశ్నించాడు.
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందులో ఇదే జరిగింది. హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ పై వస్తున్నవారిపై జరిమానాలు విధిస్తున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడిని కూడా పోలీసులు ఆపారు. అయితే.. అదే సమయంలో హెల్మెట్ పెట్టుకోకుండా అటుగా వచ్చిన పోలీసుల్ని చూపించాడు. మీరు హెల్మెట్లు పెట్టుకోకుంటే పర్లేదా. ఆ బాధ్యత మీకు లేదా? మీరు పెట్టుకోకుండా మాకు ఫైన్లు ఎలా వేస్తారు? అని పోలీసుల్ని ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది.