ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది కొత్త విషయం కాదు. చాలా ఏళ్ళుగా నడుస్తున్న తంతు ఇది.
వృద్ధాప్య పెన్షన్ల దగ్గర్నుంచి, చాలా వ్యవహారాల్ని ‘సంక్షేమం’ కోటాలో వేసేస్తున్నాం. ఆ ప్రభుత్వం కంటే, ఈ ప్రభుత్వం ఎక్కువ సంక్షేమం చేస్తుంది. ఈ ప్రభుత్వం కంటే, తర్వాతి ప్రభుత్వం ఇంకా ఎక్కువ సంక్షేమం చేస్తుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఓటర్లకు ఈ విషయమై ఖచ్చితమైన అభిప్రాయం వుంది.
చంద్రబాబు హయాంలోనూ సంక్షేమ పథకాలు అమలయ్యాయి. వాటిల్లో కొన్నిటిని వైసీపీ రద్దు చేసింది, వాటి స్థానంలో కొత్త సంక్షేమ పథకాల్ని అమలు చేసింది. చంద్రబాబు కంటే ముందు కాంగ్రెస్ హయాంలోనూ సంక్షేమ పథకాలు నడిచాయి. సంక్షేమం అంటే, జనాల్ని సోమరిపోతుల్ని చేయడం.. అన్న వాదన ఎప్పుడూ వుంటుంది.
తెలంగాణలోనూ సంక్షేమ పథకాలు అమలయ్యాయి కేసీయార్ హయాంలో. కానీ, కేసీయార్ మూడోసారి అధికారంలోకి రాలేకపోయారు కదా.! సంక్షేమం ఒక్కటే కొలమానం కాదనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?
ఇంతకీ, ఆంధ్ర ప్రదేశ్ ఓటర్లలో ఎంతమంది సంక్షేమానికి సానుకూలంగా ఓటేసినట్టు.? ఇది చెప్పడం కష్టం. ‘వైఎస్ జగన్ హయాంలో పెన్షన్ మూడు వేలు.. చంద్రబాబు హయాంలో అది నాలుగు వేలు కాబోతోంది..’ అన్న ప్రచారం జనంలోకి బాగా వెళ్ళిపోయింది. అంతే కాదు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కూడా జనాల్లోకి బాగానే వెళ్ళింది.
రాష్ట్ర రాజధాని సహా అనేక అంశాల గురించి గ్రామ స్థాయిలో చర్చ జరిగింది. అదీ, సంక్షేమ పథకాల లబ్దిదారుల్లోనే. మద్య నిషేధం వ్యవహారం కూడా చర్చకు వచ్చింది. వాట్ నాట్.. ప్రజలు అన్నీ సమీక్షించుకున్నారు. నేరుగా తమ ఇంటి వద్దకు వాలంటీర్లు వచ్చి, సంక్షేమ పథకాలు అందిస్తుండడం దగ్గర్నుంచి కొన్ని సానుకూలతలు వైసీపీ చెబుతున్నట్లు వున్నాయ్.
ఆ వాలంటీర్ వ్యవస్థను తీసేస్తామని కూటమి చెప్పలేదు కదా.? పైగా, వాలంటీర్లకు రెట్టింపు గౌరవ వేతనం ఇస్తామని చంద్రబాబు ప్రకటించేశారాయె. ఇలా చెప్పుకుంటూ పోతే, వైసీపీ మేనిఫెస్టో కంటే, చంద్రబాబు మేనిఫెస్టోనే (బీజేపీ బలపరిచిన టీడీపీ – జనసేన కూటమి మేనిఫెస్టో) ఓటర్లను ఒకింత ఎక్కువ ఎట్రాక్ట్ చేసింది.
దాంతో, సంక్షేమ పథకాల లబ్దిదారులు, వైసీపీ హయాంలో సంక్షేమ పథకాలు బాగానే వచ్చాయ్.. అంతకు ముందు చంద్రబాబు హయాంలో కూడా అంతే. ఈసారి ఇంకాస్త ఎక్కువ సంక్షేమం వైపు మొగ్గు చూపుతున్నాం.. అని ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో ఓటర్లు అభిప్రాయపడటం కనిపించింది.
పోలింగ్ తర్వాతి రోజు, వివిధ వర్గాల ప్రజలు, కూటమికి అనుకూలంగా ఓటేయడానికి చెప్పిన ప్రధాన కారణాల్లో ఇవి కొన్ని మాత్రమే. రోడ్ల మీద గుంతలు వైసీపీకి ప్రతికూలంగా మారాయన్నది వైసీపీ సానుభూతిపరులు చెప్పినమాట. ఇలా కీలకమైన విషయాల్ని జనం బాగానే గుర్తుపెట్టుకుని ఓట్లేసినట్లు కనిపిస్తోంది.
అలాగని, సంక్షేమం ద్వారా అస్సలు ఓట్లు రావని కూడా అనేయలేం.! సంక్షేమం దారి సంక్షేమానిదే.. సమస్యల దారి సమస్యలదే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యవహారం గ్రామ స్థాయిలో వైసీపీకి ప్రతికూలంగా మారిందని చెప్పొచ్చు.
మొత్తంగా చూస్తే, వైసీపీ చెబుతున్నట్లు, సంక్షేమం వైసీపీకి తిరిగి అధికారం తెచ్చిపెట్టే పరిస్థితే లేదన్నది నిర్వివాదాంశం. ‘మేం సంక్షేమం ఇచ్చాం.. ఓటర్లు మాకే ఓటెయ్యాలి..’ అని వైసీపీ ఇంకా మూర్ఖత్వం ప్రదర్శిస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.