Vijay Antony: బిచ్చగాడు (Bichagadu) సినిమా హీరో విజయ్ ఆంటోనీ (Vijay Antony) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన పెద్ద కుమార్తె మీరా ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని వారి నివాసంలో మంగళవారం తెల్లవారుజామున 3గంటలకు ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. దీంతో విజయ్ ఆంటోనీ, కుటుంబసభ్యులు తీవ్ర విచారంలో మునిగిపోయారు.
ఈ ఉదయం ఆమె గదిలో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చూసిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. చెన్నైలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆమె ఇంటర్మీడియట్ చదువుతున్నట్టు తెలుస్తోంది. తీవ్ర ఒత్తిడితోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. విజయ్ భార్య ఫాతిమా నిర్మాత. ఆమెను 2006లో పెళ్లి చేసుకున్నారు వారికి ఇద్దరు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తె బలవన్మరణం చెందారు.
తెలుగులో కృష్ణవంశీ-శ్రీకాంత్ కాంబోలో వచ్చిన మహాత్మా సినిమాకు సంగీతం అందించిన విజయ్ ఆంటోనీ.. బిచ్చగాడు సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన విషయం తెలిసిందే. ఇటివలే బిచ్చగాడు-2తో కూడా మరోసారి ప్రేక్షకుల్ని పలకరించారు.