ఓ వైపు వైసీపీ నుంచి దాడి.. ఇంకో వైపు తెలుగుదేశం పార్టీ నుంచి దాడి.. వెరసి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద వ్యూహాత్మకమైన దాడి జరుగుతోంది.
రెడ్డి సామాజిక వర్గం నుంచి వైసీపీ తరఫున దాడి జరుగుతోంటే, కమ్మ సామాజిక వర్గం నుంచి టీడీపీ తరఫున జనసేన అధినేత మీద జరుగుతున్న రాజకీయ దాడిని ఏ కోణంలో చూడాలి.? అన్నదానిపై ప్రజల్లో లోతైన చర్చ జరుగుతోంది.
2024 ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీని కలుపుకుపోదామనుకుంటున్నారు. నిజానికి, జనసేన మీద రాజకీయంగా తొలుత వలపు బాణాన్ని విసిరిందే టీడీపీ.
2019 ఎన్నికల తర్వాత, పూర్తిగా నిర్వీర్యమైపోయిన టీడీపీ, వ్యూహాత్మకంగా జనసేనతో వన్‌సైడ్ లవ్ ట్రాక్ కోసం ప్రయత్నించింది. ‘మనం ప్రయత్నిస్తున్నాం.. ఆయనే స్పందించాలి..’ అంటూ చంద్రబాబు తన మనసులో మాట బయటపెట్టేశారు కూడా.
కానీ, ఎప్పుడైతే ‘వారాహి విజయ యాత్ర’ సక్సెస్ అయ్యిందో.. ఆ తర్వాత టీడీపీ ఆలోచనల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ ఎటూ, జనసేన మీద తీవ్రాతి తీవ్రమైన స్థాయిలో విషం చిమ్ముతుందనుకోండి.. అది వేరే సంగతి. ఆ వైసీపీకి, ఇప్పుడు టీడీపీ తోడయ్యింది.
వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే ఉద్దేశ్యం టీడీపీకి వున్నప్పుడు, జనసేన మీద ఎందుకు ఇంతలా విషం చిమ్ముతున్నట్టు.? కింది స్థాయిలో జనసేన – టీడీపీ మద్దతుదారులు ముందు ముందు కలిసి పని చేయడం వీలవుతుందా.? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అది అసాధ్యంలానే కనిపిస్తోంది.
అధికార పార్టీని ఎదుర్కోవాలంటే, విపక్షాలు ఐక్యంగా వుండాలి. ఇది ప్రాథమిక రాజకీయ సూత్రం.! అధికార పార్టీతో, ప్రధాన ప్రతిపక్షం తెరవెనుక చేతులు కలిపి, జనసేన మీద కుట్రలు చేస్తోంటే, దాన్నేమనుకోవాలి.? కాపు సామాజిక వర్గం రాజకీయంగా ఎదగకూడదన్న కోణంలో రెడ్డి పార్టీ, కమ్మ పార్టీ ఒక్కటయ్యాయ్.. అన్న బలమైన సంకేతమైతే కాపు సామాజిక వర్గంలోకి వెళుతోంది.
ఈ తరుణంలో, జనసేనకు అండగా నిలబడాల్సిన బాధ్యత కాపు సామాజిక వర్గానిదే అవుతుంది.! ‘కాపు’ కాస్తారా మరి.?