సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు.
అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో వెకిలి వ్యాఖ్యలు, సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర ట్వీట్లు.. వీటికి తోడు, న్యూస్ ఛానళ్ళు, వెబ్ మీడియాలో పనికిమాలిన ప్రస్తావనలు.!
అసలు విషయంలోకి వస్తే, కమల్ హాసన్ గొప్పోడా.? చిరంజీవి గొప్పోడా.? అన్న విషయమై రచ్చ జరుగుతోంది సోషల్ మీడియా వేదికగా. అసలు ఈ పోలికే అర్థం లేనిది. మెగాస్టార్ చిరంజీవి గొప్పతనం గురించి కమల్ హాసన్ పలు సందర్భాల్లో చెప్పారు. అలాగే, విశ్వ నటుడు కమల్ హాసన్ గురించి ఎన్నో సందర్భాల్లో చిరంజీవి చెప్పడం చూశాం.
తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని స్టార్ చిరంజీవి. వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ, అత్యద్భుతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న కమల్ హాసన్.. ఈ ఇద్దర్నీ ఎలా పోల్చి చూడగలం.? ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ.. అని అనడానికి ఆస్కారమే లేదు. కానీ, అనేస్తున్నాం.!
చిరంజీవి కాలి గోటికి కూడా కమల్ హాసన్ సరిపోడన్నది ఓ వాదన. కమల్ హాసన్ కాలి గోటికి కూడా చిరంజీవి సరిపోడన్నది ఇంకో వాదన. తమ తమ ఖ్యాతి విషయంలో అటు చిరంజీవికిగానీ, ఇటు కమల్ హాసన్‌కిగానీ ఎలాంటి సందేహాలుండవు. ఒకరి మీద ఇంకొకరికి ద్వేషమూ వుండవు.
‘నాకంటే గొప్ప నటుడు చిరంజీవి..’ అని అనడానికి కమల్ హాసన్ ఏమాత్రం సందేహించడు. అలాగే, ‘కమల్ హాసన్ నాకంటే చాలా చాలా గొప్ప నటుడు’ అని చెప్పడానికి చిరంజీవి కూడా సందేహించే పరిస్థితి వుండదు. ఎంత ఎదిగినా, ఒదిగి వుండే స్వభావమే అటు కమల్ హాసన్‌ని అయినా, చిరంజీవిని అయినా ఈ స్థాయిలో నిలబెట్టింది.
కమల్ హాసన్ నిత్య విద్యార్థి. చిరంజీవి అయినా అంతే.! కాకపోతే, కమర్షియల్ ఫార్ములా చిరంజీవిని కొంత ఇబ్బంది పెట్టింది. కమల్ హాసన్‌లా ఎక్కువ ప్రయోగాలు చేయడానికి ఆస్కారం లేకుండా చేసింది. అదే సమయంలో, చిరంజీవి చేసినన్ని కమర్షియల్ సినిమాలు కమల్ హాసన్ చేయలేకపోయారు.
దర్శక నిర్మాతలు, ప్రేక్షకులు తమను ఎలా చూడాలనుకుంటున్నారో అలా కమల్ హాసన్ అయినా, చిరంజీవి అయినా తమను తాము మలచుకున్నారు. తమిళ సినిమాకే కాదు, ఇండియన్ సినిమాకే గర్వకారణం కమల్ హాసన్.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు. చిరంజీవి కూడా అంతే. ఇండియన్ సినిమాకి.. వసూళ్ళ పరంగా సరికొత్త స్టార్‌డమ్ అద్దిన నటుడు చిరంజీవి.
సో, పోలిక అనవసరం. చిరంజీవి – కమల్ హాసన్ మాత్రమే కాదు, ఏ ఇద్దరు నటులు, ఏ ఇద్దరు నటీమణుల మధ్య కూడా ఇలాంటి పోలికలు అర్థరహితం. పోలిక తీసుకురావడమంటే, ఒకర్ని అవమానపర్చడం కాదు.. ఇద్దర్నీ అవమానపర్చడం కిందే లెక్క.! ఒకర్ని మించి ఇంకొకరు.. ఇదీ ఆ ఇద్దరి నటులకి మనం ఇవ్వగలిగే గౌరవం.