‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అయితే, ‘160 ప్లస్ సీట్లను కూటమి గెలుస్తుంది. ఓ పెద్ద వేవ్ రాబోతోంది..’ అని ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో సెలవిచ్చారు.
సరే, రాజకీయాలన్నాక ఈ నెంబర్ గేమ్ గురించి ఎవరికి తోచిన లెక్క వాళ్ళు చెప్పొచ్చు. ఎన్నికల తర్వాత అల్లర్ల నేపథ్యంలో పలువురు వైసీపీ కార్యకర్తలు గాయపడ్డా, వారిని పరామర్శించని వైసీపీ అధినేత వైఎస్ జగన్, హడావిడిగా ‘ఐ-ప్యాక్’ బృందాన్ని కలిసి అభినందించేశారు.
ఈ సందర్భంలోనే, 2019 కంటే పెద్ద విజయం సాధించబోతున్నామంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అదే నిజమైతే, వైసీపీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఎందుకు ఇతర పార్టీల్లోకి దూకేస్తారు.? దాదాపు సగం మంది సిట్టింగ్ ప్రజా ప్రతినిథులకు సీట్లు ఎందుకు ఇవ్వనట్టు.?
విషయం సుస్పష్టం. ఎలాగోలా గట్టెక్కితే చాలన్న ఆలోచనతో వుంది వైసీపీ. పోలింగ్‌కి ముందు పెద్దయెత్తున కరెన్సీ పంపకాలతో ఓటర్లను వైసీపీ ప్రలోభపెట్టినా, ఓటింగ్ వైసీపీకి అంత సానుకూలంగా పడలేదు.
టీడీపీ విషయానికొస్తే, వైసీపీతో సమానంగా కష్టపడింది టీడీపీ, పంపకాల విషయంలో. అయితే, టీడీపీకి కొంత క్రాస్ ఓటింగ్ టెన్షన్ వుంది. టీడీపీ – బీజేపీ – జనసేన మధ్య ఓటు షేరింగ్ విషయంలోనూ టీడీపీకి కొన్ని అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో సొంతంగా ఎన్ని సీట్లను గెలుస్తామన్నదానిపై టీడీపీ ఒకింత మల్లగుల్లాలు పడుతోంది.
వంద తేలిగ్గా దాటేస్తామని టీడీపీ నేతలు పైకి చెబుతున్నారు. పైకి ఏం చెప్పినా, తెరవెనుకాల అసలు వ్యవహారాలు వేరే వుంటాయ్. వేవ్ వస్తే, వైసీపీ దారుణమైన దెబ్బ తింటుందని టీడీపీ భావిస్తోంది. అంత వేవ్ వుందా.? లేదా.? అన్నదాని మీదనే టీడీపీ డైలమా తగ్గట్లేదు. కూటమిగా 110 సీట్లు కొట్టగలమని మాత్రం టీడీపీ ఒకింత ధీమాగా వుంది.