ఆయన కెరీర్లో చూడని ఎత్తుపల్లాలు లేవు. హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లే కాదు.. చేదు ఫలితాలు కూడా రుచి చూశారు. పడిన ప్రతిసారీ ఉవ్వెత్తున ఎగసి పడే కెరటంలా దూసుకొచ్చారు. అలుపెరుగని ఆయన సినీ ప్రయాణంలో విజయాలే కాదు.. గౌరవం కూడా అంతకంతకూ పెరిగింది. ఎవరెస్ట్ శిఖరమంత ఇమేజ్ ఉన్నా చిన్న చిన్న ముళ్లు ఉన్న గుట్టలంత విమర్శలు ఆయన్ను పలకరించేవి. కానీ.. శిఖరం ఎవరి ముందూ తలవంచదు. ఆయన గౌరవం ఆయనే ఉంటూ వస్తోంది. ఈరోజు అందరూ మాట్లాడుతున్న ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల పురస్కారాల కార్యక్రమానికి 1987లోనే ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణ భారతీయ సీనీ హీరో చిరంజీవి. ఆ గౌరవంతోపాటు చిరంజీవి ఎన్నో మణులను తన కీర్తి కిరీటంలో అలంకరించుకున్నారు. సినిమాల్లో ఆయన సేవలకు గుర్తుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
పద్మభూషణ్ గౌరవం..
సినిమాకు చిరంజీవి అందించిన సేవలు, సమాజ సేవను గుర్తించి భారత ప్రభుత్వం దేశపు మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ తో గౌరవించింది. నాడు తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఆనందంతో దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ను ఆహ్వానించి ఘనంగా వేడుక కూడా నిర్వహించింది. సినిమాల్లో ఆయన ఘన విజయాలకు బిరుదులు మారుతూనే ఉండేవి. డైనమిక్ హీరో, సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ బిరుదు చిరస్థాయిగా నిలిచిపోయింది. 2016 ఏడాదికి.. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తెలుగు చలన చిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య అవార్డును ఇచ్చి చిరంజీవిని గౌరవించింది. గతేడాది గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డుల్లో ‘ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ గౌరవంతో సత్కరించింది.
నంది, ఫిలింఫేర్ అవార్డులు..
సినిమాల్లో చిరంజీవి ప్రతిభకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు నంది అవార్డులు, 9 ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ అవార్డులు వరించాయి. దీంతోపాటు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు కూడా దక్కింది. 2013లో సీఎన్ఎన్-ఐబీఎన్ సంస్థ చిరంజీవిని ‘ది మెన్ హూ చేంజ్ డ్ ద ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా’ గా పేర్కొంది. 1988లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ బెస్ట్ అవార్డు ఆయన్ను వరించింది. స్వయంకృషి సినిమా రష్యన్ భాషలోకి డబ్ అయి మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. సహ నిర్మాతగా తెరకెక్కించిన రుద్రవీణ సినిమాకు జాతీయ అవార్డుల్లో నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు దక్కించుకుంది. ఇవన్నీ చిరంజీవిలో ఉన్న నటుడికి దక్కిన గౌరవాలు. వీటితోపాటు అనేక సినీ అవార్డులు చిరంజీవిని వరించాయి.