ఆంధ్రప్రదేశ్‌కి చెందిన టీడీపీ ముఖ్య నేత ఒకరు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారట. మే 23న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానుండగా, అంతకు ముందే ఆయన టీడీపీని వీడాలనుకుంటున్నారని సమాచారమ్. ఇన్నాళ్ళూ చంద్రబాబుకి కుడి భుజంలా వ్యవహరించిన ఆ నేత, వ్యక్తిగత కారణాలతో వేరే దారి లేక బీజేపీ చెంతకు చేరాలనే నిర్ణయానికి వచ్చారని టీడీపీతోపాటు, బీజేపీ వర్గాల్లోనూ ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయన బీజేపీ వైపు వెళ్ళాలనుకున్నా, చంద్రబాబు అతి బలవంతం మీద ఆయన్ని టీడీపీలో కొనసాగగలిగేలా చేశారని సమాచారమ్.
కేంద్రంలో మళ్ళీ బీజేపీ గనుక అధికారంలోకి వస్తే తనకు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి గనుక తనకు వేరే దారి లేదంటూ సదరు నేత ఇటీవలే చంద్రబాబుతో చెప్పారని కూడా టీడీపీ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. ఆ నేత, చాలామందికి సుపరిచితుడే. ఓ రకంగా ‘స్టార్’ స్టేటస్ వున్న పొలిటికల్ లీడర్ ఆయన. ప్రత్యేక హోదా విషయంలోనూ, ఇతర ముఖ్య విషయాల్లోనూ చంద్రబాబు కంటే ఎక్కువగా ఒకప్పుడు మోడీని ఆయన వెనకేసుకొచ్చారు. అప్పట్లో అలా ఆయన చెప్పడానికి ‘వేరే’ కారణాలు వున్నాయనీ, ఆ ‘వేరే’ కారణాలకు కొత్తగా మరికొన్ని సమస్యలు ఎదురవడంతోనే ఆయన టీడీపీని వీడి, బీజేపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చారనీ సమాచారమ్ అందుతోంది.
రాజకీయం అంటేనే గోడ దూకుడు వ్యవహారంగా మారిపోయింది. ఏ నేత ఎప్పుడు ఏ పార్టీలో వుంటారో చెప్పడం కష్టం. ఇక్కడ సిద్ధాంతాల కన్నా, అవసరాలే ముఖ్యం. ఆ అవసరాలకు తగ్గట్టుగానే నేతలు తక్కెడలోని కప్పల్లా అటూ ఇటూ దూకేస్తున్నారు. ఇంతకీ, సదరు టీడీపీ ముఖ్య నేతగారి డిటెయిల్స్ చెప్పలేదు కదూ! ఇప్పుడే చెప్పడం సబబు కాదు.
ఆయనగారు, చంద్రబాబు సామాజిక వర్గానికే చెందిన వ్యక్తి. పైగా, మాంఛి ధన బలం వున్న నాయకుడు. ‘మేనేజ్‌మెంట్ స్కిల్స్’లో కూడా దిట్ట. అన్నిటికీ మించి, వివాదాలకు కేరాఫ్ అడ్రస్. మే 23న ఫలితాలు రాబోతున్నాయి. రెండు మూడు రోజుల ముందే అయినా ఆయన టీడీపీని వీడి, బీజేపీలో చేరతారట. ఈ మేరకు బీజేపీ ఢిల్లీ పెద్దలకు రాష్ట్ర బీజేపీ నేతలు సమాచారం కూడా పంపించారని, అయితే సదరు నేతకి డైరెక్ట్‌గా ఢిల్లీ పెద్దలతోనే ‘మంచి’ పరిచయాలు వుండడంతో, అమిత్ షా – నరేంద్రమోడీ సమక్షంలో బీజేపీలో చేరతారనీ అంటున్నారు.