ఆయన విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు.! సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చి అతి తక్కువ కాలంలోనే, అనూహ్య విజయం సాధించి.. ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు.!
తెలుగు దేశం పార్టీ అధినేత, సినీ నటుడు, దివంగత స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించే ఇదంతా.! తెలుగు నేలపై రాముడంటే ఇలా వుంటాడు.. కృష్ణుడంటే ఇలా వుంటాడు.. ఇలా ఎన్టీయార్ గురించి ఒకప్పుడు సినీ అభిమానులు చెప్పుకునేవాళ్ళు.! అప్పటి రోజులు అవి.
స్వర్గీయ ఎన్టీయార్ ముఖ్యమంత్రి అయ్యాక, సహజంగానే ఆయనా రాజకీయ విమర్శలు ఎదుర్కొన్నారు. రాజకీయాల్లో ఆయన ఎదుర్కొన్న వెన్నుపోటు.. చరిత్రకెక్కింది.! స్వర్గీయ ఎన్టీయార్ చివరి రోజులు అత్యంత దయనీయంగా సాగాయి.
‘ఇలాంటి చావు ఇంకెవరికీ రాకూడదు.. పగవాడిక్కూడా రాకూడదు..’ అని అంతా అనుకునేంతటి దురదృష్టకరమైన మరణం సంభవించింది స్వర్గీయ ఎన్టీయార్ విషయంలో. చెరిపేస్తే చెరిగిపోయే చరిత్ర కాదిది.
అయ్యిందేదో అయిపోయింది.. తెలుగునాట తిరుగులేని కథానాయకుడు.. తిరుగులేని రాజకీయ నాయకుడన్న గుర్తింపు ఆయనకు ఎప్పటికీ అలాగే వుంది కదా.! ఔను, వుంది కదా.! కానీ, ఆ గుర్తింపుని చెడగొడుతున్నదెవరు.? ఇంకెవరు, ఆయన్ని అభిమానిస్తున్నామని చెప్పుకునే కొందరు.
స్వర్గీయ ఎన్టీయార్ మీద ‘కుల ముద్ర’ వేశారు కొందరు. ‘మా కుల పురుషుడు.. మా ఆత్మ గౌరవం..’ అంటూ కొందరు రుద్దిన బలవంతపు రుద్దుడు కారణంగా, స్వర్గీయ ఎన్టీయార్ ‘కొందరివాడు’గా మారిపోయారు. ఎన్టీయార్‌కి భారత రత్న కావాలంటూ ఆయన కుటుంబ సభ్యులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు.
అసలంటూ ఎన్టీయార్ కుటుంబంలో ఐక్యత వుంటే కదా.? చట్ట బద్ధంగా సతీమణి అయిన లక్ష్మీపార్వతి.. చేసే రాజకీయ పంచాయితీ, ఆమె మీద నందమూరి మరియు నారా కుటుంబాలకి వున్న మంట.. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ‘ఆమె బతికి వున్నంతవరకు ఎన్టీయార్‌కి భారత రత్న రాకూడదు’ అని టీడీపీలో ఓ వర్గం కోరుకుంటోందంటే.. ఆ కుల పురుషుడికి ఏదో శాపం వున్నట్టే కదా.?
ఎన్టీయార్ జీవించి వున్న కాలంలో అసలు ఆయన పెద్దగా కులాల ప్రస్తావన తెచ్చేవారు కాదని అంటారు, ఆయనతో సన్నిహితంగా వున్న చాలామంది. కానీ, ఆయన మీద కమ్మటి ‘కులపురుషుడన్న’ ముద్ర.. ఇదిగో, ఇన్ని అనర్థాలకి కారణమవుతోంది.
తెలుగు ఠీవీ.. పీవీ నరసింహారావుకి భారతరత్న పురస్కారాన్ని కేంద్రం ప్రకటించిన దరిమిలా, సోకాల్డ్ ‘కమ్మ’టి వర్గం, ఆ పీవీ నరసింహారావు మీద చేస్తున్న అభ్యంతరకర వ్యాఖ్యలు అన్నీ ఇన్నీ కావు. కుల పురుషుడి మీద ప్రేమ వుంటే, ఇతరుల మీద ద్వేషం చూపించాలా.?