తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ బలం ఎంత.? బలహీనతలు ఏంటి.? ఈ విషయమై జనసైనికుల్లో చిన్నపాటి అయోమయం నిన్న మొన్నటిదాకా వుండేది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని మరీ, జనసేన పార్టీ తనదైన ప్రత్యేకతను చాటుకుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయగల చిత్తశుద్ధి వున్న ఒకే ఒక్క ప్రాంతీయ పార్టీ ప్రస్తుతానికి జనసేన మాత్రమే.! వాస్తవానికి 32 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేయాలనుకున్నా, తెలంగాణలో బీజేపీతో పొత్త నేపథ్యంలో ఆ సంఖ్య సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యింది.
ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నామనేది కాదు, పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఎన్నింటిని గెలిచాం.? ఎన్నింటిలో ప్రభావం చూపగలిగాం.? అన్న కోణంలోనే జనసేన వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది. గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని కూకట్‌పల్లి నియోజకవర్గం జనసేనకు కొంత సానుకూలంగా మారుతోంది.
మొత్తంగా ఓ నాలుగైదు నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి విజయావకాశాలు వున్నాయని తెలంగాణలో ఇటీవలి కాలంలో అంతర్గతంగా జరుగుతున్న పలు సర్వేలలో తేలుతోంది. సరే, జనసేన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుంది.? అన్నది వేరే చర్చ.
అయితే, తెలంగాణ జనసేనలో కనిపిస్తోన్న జోరు కాస్తా, ఆంధ్రప్రదేశ్ జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోందని నిస్సందేహంగా చెప్పొచ్చు. వైఎస్ షర్మిల, తెలంగాణలో పార్టీని నడపలేకపోతున్న పరిస్థితిని చూస్తున్నాం. సుదీర్ఘ రాజకీయ అనుభవం తన సొంతమని చెప్పుకుంటోన్న చంద్రబాబు తెలంగాణలో టీడీపీని ఏం చేశారో చూస్తున్నాం.
వీటన్నిటి నడుమ, జనసేన పార్టీ గట్టిగా నిలబడటమే, ఆ పార్టీ ఘనత.. అని వేరే చెప్పాలా.? అన్నది సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఓ రెండు మూడు సీట్లలో అయినా జనసేన గెలిస్తే, ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేనకు మరింత సానుకూలంగా మారుతుందన్నది నిర్వివాదాంశం.