నారా చంద్రబాబు నాయుడు మీద పోటీ చేస్తారా.? దగ్గుబాటి పురంధేశ్వరి మీద పోటీ చేస్తారా.? ఇంతకీ, వైసీపీ నేత లక్ష్మీ పార్వతి ఎవరి మీద పోటీ చేయబోతున్నారు వచ్చే ఎన్నికల్లో.? పోనీ, ఇద్దరి మీదా పోటీ చేసేస్తోనో.!
స్వర్గీయ ఎన్టీయార్.. పరిచయం అక్కర్లేని పేరిది.! చనిపోయాక కూడా పాపం ఆయనకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఒకవేళ ఆయన స్వర్గంలో వున్నా, ఆయన్ని కుటుంబ సభ్యులు నరకంలోకి నెట్టేసేలా వున్నారు. ఔను, స్వర్గీయ ఎన్టీయార్‌కి వేరే శతృవులు అవసరం లేదు.!
వెన్నుపోటు అనండీ.. ఇంకోటేదన్నా పేరు పెట్టండి.. జరిగింది మాత్రం, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావుని అంతమొందించడమే.! రాజకీయంగా, మానసికంగా, శారీరకంగా.. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుని అంతమొందించేశారు. ఎవరు.? ఎలా.? అన్నది తెలుగు నేలపై దాదాపుగా ప్రతి ఒక్కరికీ తెలుసు.
పోయినోళ్ళంతా మంచోళ్ళే.. అనుకుని, ఆయన మరణాన్ని వివాదాస్పదం చేయకుండా వుంటే మంచిది. కానీ, చేస్తున్నారు.! నిన్న మొన్నటిదాకా చంద్రబాబు పతనాన్ని చూస్తానని శపథం చేశారు లక్ష్మీ పార్వతి. ఇప్పుడేమో, పురంధేశ్వరి సంగతి తేల్చుతానంటున్నారు. ఎవర్నయితే వెన్నుపోటు పొడిచారో, ఆయన్నే.. చంద్రబాబు ఇప్పుడు మొక్కుతున్న సంగతి తెలిసిందే.
ఆనాటి ఆ వెన్నుపోటుకి అసలు పథక రచన చేసింది స్వయానా దగ్గుబాటి పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు.! ‘మా నాన్న’ అని ఘనంగా పురంధేశ్వరి.. ‘మా మామగారు..’ అంటూ ఇంకా ఘనంగా చంద్రబాబు.. ఆ స్వర్గీయ ఎన్టీయార్ గురించి చెబుతున్నారు. అసలు ఎన్టీయార్‌కి దుర్గతి పట్టడానికి కారణమే లక్ష్మీ పార్వతి. ఆమె ఒకటికి వంద సార్లు ‘నా భర్త..’ అంటున్నారు.! ఎన్టీయార్ పేరు, ఇంతలా ‘వాడకానికి’ గురవుతుండడం పట్ల, ఆ ఎన్టీయార్ ఆత్మ ఎంతలా క్షోభిస్తోందో ఏమో.!