యంగ్ టైగర్ ఎన్టీయార్ ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా వున్నాడు. కానీ, స్వర్గీయ ఎన్టీయార్ స్థాపించిన తెలుగుదేశం పార్టీతోనే వున్నాడు.! ఈ విషయం పలు సందర్భాల్లో ఆయన చెప్పాడు కూడా. టీడీపీ మీద జూనియర్ ఎన్టీయార్‌కి మమకారం వుండడాన్ని తప్పు పట్టలేం. కానీ, జూనియర్ ఎన్టీయార్‌ని టీడీపీ దూరం పెడుతోంది. అదే అసలు సమస్య.
ముఖ్యమైన సందర్భాల్లో టీడీపీ దరిదాపుల్లోకి కూడా రానీయకుండా జూనియర్ ఎన్టీయార్‌ని టీడీపీ అధినేత చంద్రబాబు దూరం పెడుతున్నారు. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీయార్‌ని టీడీపీ తరఫున ప్రచారం కోసం చంద్రబాబు వాడుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో, ప్రజారాజ్యం పార్టీ మీద జూనియర్ ఎన్టీయార్ చేసిన రాజకీయ విమర్శలు అన్నీ ఇన్నీ కావు.
కానీ, ఏం జరిగింది.? ఆ ఎన్నికల తర్వాత, టీడీపీ వైపుకి కూడా జూనియర్ ఎన్టీయార్‌ని రానివ్వలేదు చంద్రబాబు. అంతేనా, కొడాలి నాని మీద అసహనంతో, బాలయ్య ద్వారా జూనియర్ ఎన్టీయార్‌ని తిట్టించారు టీడీపీ అధినేత. అబ్బో.. ఇలాంటివి చాలానే జరిగాయి. హరికృష్ణ కూడా అప్పట్లో తన బిడ్డ జూనియర్ ఎన్టీయార్ విషయంలో టీడీపీ చేస్తున్న కుట్రలపై వాపోయారు.
ఇప్పుడిదంతా ఎందుకంటే, టీడీపీలో కొందరు జూనియర్ ఎన్టీయార్ అభిమానులకి సంకటం ఏర్పడింది. టీడీపీలో జూనియర్ ఎన్టీయార్ పొటోలపై అనధికారిక నిషేధం వుంది. జూనియర్ ఎన్టీయార్ సినిమాలు చూడొద్దంటూ, వాట్సాప్ మెసేజ్‌లు కూడా వెళుతుంటాయ్. అయినా, టీడీపీతోనే వుంటున్నారు జూనియర్ ఎన్టీయార్ అభిమానులు.
వారిలో కొందరు, జనసేనకి మద్దితివ్వడం ప్రారంభించారు. ఇంకొందరు వైసీపీ తరఫున వకాల్తా పుచ్చుకుంటున్నారు. ఎవరిష్టం వారిది.! అయితే, అసలు పంచాయితీ ఎక్కడ వస్తోందంటే, పవన్ కళ్యాణ్ మీదనో, రామ్ చరణ్ మీదనో, చిరంజీవి మీదనో.. విమర్శలు చేయడానికి, కొన్ని హ్యాండిల్స్ (జూనియర్ ఎన్టీయార్ అభిమానుల పేరుతో) అత్యుత్సాహం చూపుతున్నాయి.
దాంతో, సహజంగానే కౌంటర్ ఎటాక్, మెగా కాంపౌండ్‌కి చెందిన హీరోల అభిమానుల నుంచీ వస్తుంటుంది. అంతే, ‘వచ్చే ఎన్నికల్లో జనసేన సంగతి చూస్తాం..’ అని సోకాల్డ్ జూనియర్ ఎన్టీయార్ అభిమానులు హెచ్చరిస్తున్నారు. ఇదెక్కడి గోల.? అసలు ఇంత అసహనం జూనియర్ ఎన్టీయార్ అభిమానులకెందుకు.? బహుశా, టీడీపీ.. ఆ జూనియర్ ఎన్టీయార్‌ని, ఆయన అభిమానుల్నీ లెక్క చేయకపోవడం వల్లేనేమో.!