తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు డ్రగ్స్ ఆరోపణలు కుప్పలు తెప్పలుగా వెల్లువెత్తాయి. ఓ సినీ ప్రముఖుడి సోదరుడు పలుమార్లు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం విదితమే. ఓ దర్శకుడిపైనా, ఓ ఎనర్జిటిక్ హీరోయిన్‌పైనా, ఓ యంగ్ హీరోపైనా, ఓ హాట్ నటిపైనా.. ఇలా చెప్పుకుంటూ పోతే, చాలామందిపై ఆరోపణలు వచ్చాయి. వీరిలో కొందరపై డ్రగ్స్ అడిక్స్ అని ఆరోపణలు వస్తే, మరికొందరిపై ‘డ్రగ్స్ పెడ్లర్స్’ అనే ఆరోపణలు విన్పించాయి. ‘సినీ పరిశ్రమ పరువు తీస్తున్నారు..’ అంటూ ఆయా సందర్భాల్లో డ్రగ్స్ వాడేవారి సినీ ప్రముఖులపై కొందరు సినీ ప్రముఖులు పెదవి విరిచారు కూడా.
అయితే, టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, ఎక్సయిజ్ శాఖ తరఫున ప్రత్యేకంగా ‘సిట్’ ఏర్పాటు చేసి మరీ, విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో 12 మంది సినీ ప్రముఖులు ‘సిట్’ ఎదుట విచారణకు కూడా హాజరయ్యారు. అయితే, ఇది రెండేళ్ళ క్రితం నాటి వ్యవహారం. ఆ తర్వాత అది సద్దుమణిగింది కూడా. మళ్ళీ ఇప్పుడు ఈ అంశానికి మీడియాలో ప్రాధాన్యత దక్కడానికి కారణమూ లేకపోలేదు. అసలు ఆ కేసులో ఎవర్ని అరెస్టు చేశారు.? ఎవర్ని నిందితులుగా చూపారు? ఎవర్ని తప్పించారు.? అన్న విషయమై ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ దృష్టి సారించింది.
సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగు చూసిన విషయమేంటంటే, ఆ 12 మంది సినీ ప్రముఖులకీ క్లీన్ చిట్ లభించిందని. అయితే, ఈ విషయమై అధికారుల వెర్షన్ ఇంకోలా విన్పిస్తోంది. 4 చార్జిషీట్లను కోర్టులో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి వేశామనీ, కేసు విచారణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించలేదనీ, మరిన్ని చార్జి షీట్లు వేయాల్సి వుందని అంటున్నారు అధికారులు. సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడయిన విషయాల ప్రకారం 12 మంది సినీ సెలబ్రిటీలకు క్లీన్ చిట్ ఇచ్చింది నిజమేనా.? అన్నదానిపై మాత్రం అధికారులు స్పష్టమైన సమాచారమివ్వడంలేదు.
దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో రవితేజ, యంగ్ హీరో తరుణ్, నటి ఛార్మి, మరో నటి ముమైత్‌ఖాన్.. ఇలా 12 మంది సినీ ప్రముఖులు విచారణకు హాజరయ్యారు. వారిలో కొందరు విచారణాధికారుల కోరిన మేరకు ‘శాంపిల్స్’ ఇచ్చారు. హెయిర్, నెయిల్స్, బ్లడ్.. ఇలా పలు శాంపిల్స్‌ని అధికారులు తీసుకుని, పరీక్షలు నిర్వహించినా, వాటి వివరాలు మాత్రం బయటకు పొక్కలేదు. కొందరు శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించారనుకోండి, అది వేరే విషయం.
‘మాకు ఈ కేసుతో సంబంధం లేదు, మేం విచారణకు సహకరిస్తాం, క్లీన్ చిట్‌తో బయటకు వస్తాం’ అని దాదాపు అందరూ నమ్మకం వ్యక్తం చేశారు విచారణ సమయంలో. అన్న మాట ప్రకారమే దాదాపుగా అందరికీ క్లీన్ చిట్ వచ్చినట్లే కన్పిస్తోంది. మరోపక్క, పై పన్నెండు మందిలో కొందరు డ్రగ్స్ విషయంలో బాధితులుగా వున్నట్లు పోలీసులు చార్జి షీట్‌లో పేర్కొన్నారనే వార్తలూ బయటకు పొక్కుతున్నాయి. అయితే, పూర్తి వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కావడంలేదు.