అరరె.. న్యాయ వ్యవస్థ మీద అత్యంత అసభ్యకరమైన రీతిలో ఆరోపణలు చేసేశారే.! ఉరి తీసేస్తే పోలా.? ఔను, ఇలాగే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం టీడీపీని టార్గెట్ చేసిన వైసీపీ, ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడంలేదు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో, ఆయనకు రిమాండ్ విధించిన ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తిపైన టీడీపీ మద్దతుదారులు కొందరు అత్యంత అసభ్యకరమైన రీతిలో దూషణలకు దిగారు. అలాంటి వారిపై చర్యల నిమిత్తం, అధికార వైసీపీ, అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
మొత్తంగా 28 మందిని అరెస్టు చేసే దిశగా, చట్టపరమైన చర్యలు షురూ అయ్యాయి కూడా.! కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద.. చర్యలు తప్పేలా లేవు. నిజమే, న్యాయమూర్తులపైనా, న్యాయస్థానాలపైనా అభ్యంతరకర వ్యాఖ్యలు ఎవరూ చేయకూడదు. ఎవరు అలా చేసినా అది తప్పే.!
కానీ, కొన్ని సార్లు న్యాయ వ్యవస్థలోనివారూ తప్పులు చేస్తున్నారు కదా.? కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ వ్యవహారంలో, ఏకంగా న్యాయమూర్తి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో అదో సంచలనం.
ఆ సంగతి పక్కన పెడితే, న్యాయమూర్తుల్ని నరికెయ్యాలి.. న్యాయమూర్తుల్ని కోవిడ్ బాధితులున్న రూమ్‌లో బంధించాలి.. అని కొన్నాళ్ళ క్రితం వైసీపీ మద్దతుదారులు, అత్యంత ఛండాలంగా వ్యవహరించారు సోషల్ మీడియాలో. అప్పట్లో కొందరి అరెస్టులు జరిగాయి.. అదీ కష్టంగా.
‘న్యాయస్థానాలు తీర్పులిస్తే మాత్రం… వాటిని అమలు చేయాల్సింది మా పోలీసులే కదా.?’ అంటూ కొందరు వైసీపీ మద్దతుదారులు అప్పట్లో సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యల్ని ఎలా మర్చిపోగలం.? వాళ్ళని అప్పట్లో వెనకేసుకొచ్చిందీ వైసీపీనే. ఇప్పుడు అదే వైసీపీ, న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ మీద విమర్శలు చేస్తోంది.! రాజకీయ పాతివ్రత్యం ఇలాగే వుంటుంది మరి.!
ఎందుకు అరెస్టు చేయలేదంటూ పదే పదే అప్పట్లో న్యాయస్థానాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా పట్టించుకున్న దాఖలాల్లేవ్. ఇప్పుడేమో, చర్యల కోసం ప్రభుత్వమే అత్యుత్సాహం చూపుతుండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? చట్టం, న్యాయం.. అందరికీ సమానం కాదనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?