వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగే చంద్రబాబు ఎక్కడ.? జైలు నుంచి బయటకు రాలేకపోతున్న చంద్రబాబు గురించి మాత్రమే ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తోంది. చంద్రబాబుకి వయసు మీద పడింది. పార్టీ శ్రేణుల్ని ప్రభావితం చేయలేకపోతున్నారు. నాయకత్వ లక్షణాలూ ఇప్పుడు ఆయనలో కనుమరుగైపోయినట్లేనేమో.!
నారా లోకేష్ రేపు ఆంధ్రప్రదేశ్‌కి రాబోతున్నారు ఢిల్లీ నుంచి. వస్తూనే ఆయన్ని అరెస్టు చేయాలని ఏపీ సీఐడీ అనుకుంటోందిట. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో యువగళం పాదయాత్రని పునఃప్రారంభించబోతున్నారట లోకేష్. ఆయన కోసం అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ తాలూకు కేసు ఎదురుచూస్తోంది.
చంద్రబాబులానే నారా లోకేష్ కూడా అరెస్టయితే.. ఇక అంతే సంగతులు.! నిజానికి, ఈ రోజు సుప్రీంకోర్టులో చంద్రబాబుకి ఊరట దక్కుతుందని టీడీపీ శ్రేణులు భావించాయి. కానీ, కుదరలేదు. సుప్రీంలో చంద్రబాబుకి చుక్కెదురయ్యింది. కేసు విచారణ వచ్చే నెల మొదటి వారానికి వాయిదా పడింది.
అంటే, అప్పటివరకూ చంద్రబాబు జైల్లోనే వుండాల్సి వస్తుంది. ఈలోగా నారా లోకేష్ అరెస్టయితే.. చంద్రబాబు వుంటోన్న జైలుకే, నారా లోకేష్‌ని కూడా తరలిస్తారేమో.! అక్కడితో ఈ అరెస్టుల పర్వం ఆగుతుందా.? అంటే, రాజధాని భూ కుంభకోణాలకు సంబంధించి హెరిటేజ్ సంస్థనీ పేర్కొంటోంది ఏపీ సీఐడీ. ఆ లెక్కన, హెరిటేజ్ వ్యవహారాలు చూసుకుంటోన్న భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా అరెస్టువుతారేమో.. అంటూ వైసీపీ శ్రేణులు వెటకారాలు చేస్తున్నాయ్.
బెయిల్ కోసం ప్రయత్నించకుండా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ‘క్వాష్’ కోసం ప్రయత్నిస్తుండడమే చంద్రబాబు తరఫు న్యాయవాదులు చేస్తోన్న అతి పెద్ద తప్పిదం. క్వాష్ అంత తేలిక కాదు.! స్కిల్ స్కామ్ కేసు క్వాష్ అవ్వాలంటే, ఇప్పట్లో సాధ్యం కాదు. మరి, అప్పటిదాకా చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశమే లేదా.? అంతేనేమో.!