సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరలేపాడు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, తెలంగాణ సాధన కోసం చేసిన పోరాటం నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కించనున్నట్లు గతంలోనే ప్రకటించిన వర్మ, ఆ మాటకు కట్టుబడి తాజాగా ఈ బయోపిక్‌కి సంబంధించి టైటిల్‌ని విడుదల చేశాడు. తన ట్విట్టర్ పేజ్‌లో కేసీఆర్ బయోపిక్ టైటిల్ లుక్‌ని వర్మ విడుదల చేయడంతో, క్షణాల్లో అది వైరల్‌గా మారింది.
‘టైగర్ కేసీఆర్’ అంటూ కేసీఆర్ బయోపిక్‌కి టైటిల్ పెట్టిన వర్మ, టైటిల్‌లోనే చాలావరకు తాను చెప్పాలనుకున్నది చెప్పేశాడు. అదే సంచలనాల రామ్ గోపాల్ వర్మ ప్రత్యేకత. టైటిల్ లుక్‌లో కేసీఆర్‌ని వర్మ ‘అగ్రెసివ్ గాంధీ’ అని అభివర్ణించడం గమనార్హం. అంతే కాదు, దానికి కింద ఓ క్యాప్షన్ పెడుతూ, ‘ఆడు తెలంగాణ తెస్తనని అంటే, అందరూ నవ్విండ్రు’ అని పేర్కొనడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. కేసీఆర్ అభిమానుల నుంచి వర్మ మీద ఇప్పుడు ప్రశంసల వర్షం కురిసేస్తోంది ట్విట్టర్‌లో.
తెలంగాణ ప్రజల్ని మూడో తరగతి పౌరులుగా ఆంధ్రులు చూశారంటూ వర్మ తన ట్వీట్‌లో పేర్కొనడం మరో విశేషం ఇక్కడ. తెలంగాణ ఉద్యమ కాలంలో ఈ తరహా రాజకీయ విమర్శలు చాలానే విన్పించాయి. ఇప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా ఆంధ్రోళ్ళపై కేసీఆర్ సహా టీఆర్‌ఎస్ నేతలు విరుచుకుపడుతూనే వుంటారు. అప్పుడప్పుడూ మాత్రం, రాజకీయ అవసరాల నేపథ్యంలో ‘ఆంధ్రోళ్ళు చాలా మంచోళ్ళు..’ అని కూడా కేసీఆర్ చెబుతుంటార్లెండి. అది వేరే సంగతి.
కేంద్రంలో తాను చక్రం తిప్పాలనుకుంటున్న దరిమిలా, ఫెడరల్ ఫ్రంట్‌కి రూపకల్పన చేసిన కేసీఆర్, ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ని ‘మంచి’ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ‘ఆంధ్రోళ్ళపై కేసీఆర్‌కి ప్రేమ’ పుట్టుకొచ్చిందనే వాదన లేకపోలేదు. రాజకీయాలు పక్కన పెడితే, వర్మ తన సినిమాలో కేసీఆర్‌ని ఎలా చూపిస్తాడు? అనేదానికంటే, కేసీఆర్ పాత్రధారితో వర్మ, ఆంధ్రోళ్ళను ఎలా తిట్టిస్తాడు? అన్నదే చర్చనీయాంశంగా మారింది.
టైటిల్ లుక్‌ని వదులుతూ తన ట్వీట్‌లోనే వర్మ తన ఉద్దేశ్యమేంటో చెప్పేశాడు కాబట్టి, అంతా కేసీఆర్ కోణంలోనే సినిమా వుంటుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇటీవల ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీసిన వర్మ, వాస్తవాలే ప్రజలకు చూపిస్తానని చెప్పి, ‘లక్ష్మీపార్వతి’ కోణంలోనే సినిమా రూపొందించిన సంగతి తెల్సిందే. కాబట్టి, కేసీఆర్ దృష్టిలో తెలంగాణ ఎలా ఆంధ్రోళ్ళ కారణంగా దోపిడీకి గురయ్యిందనే విషయమే రామ్‌గోపాల్ వర్మ తన ‘టైగర్ కేసీఆర్’ సినిమాలో చూపిస్తాడని భావించవచ్చు.
ఇదిలా వుంటే, ఆంధ్రుడు అయి వుండీ రామ్‌గోపాల్ వర్మ ఇలా ఆంధ్రోళ్ళను కించపర్చే సినిమాలు తీయడమేంటని కొందరు సోషల్ మీడియాలోనే ఆయనకు ‘సరాసరి’ ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే, సోషల్ మీడియాలో తనకు నచ్చినట్లు పోస్టింగులు చేయడం తప్ప, తనపై వచ్చే విమర్శలకు ఆయన సమాధానాలు ఇచ్చిన సందర్భాలు చాలా చాలా తక్కువ. చూడాలిక, వర్మగారి ‘టైగర్ కేసీఆర్’ ఎలా వుండబోతోందో, అది ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి వివాదాల్ని ఎదుర్కొంటుందో!
KCR and YSR are the only politicians to successfully groom their children to be worthy of them,unlike the politician in the neighbouring state of Telangana …Only the greatest of political leaders can create a biological and ideological legacy pic.twitter.com/z0N7FgvdHA
— Ram Gopal Varma (@RGVzoomin) April 18, 2019
