టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 అసెంబ్లీ సీట్లనీ, 3 లోక్ సభ సీట్లనీ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కేటాయించగలిగారు. ఇలా అనడం కరెక్టా.? గెలిచే అవకాశం 98 శాతం వున్న 23 అసెంబ్లీ సీట్లు, 3 లోక్ సభ సీట్లను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్నారని అనడం సబబా.?
ఎవరెలాగైనా అనుకోవచ్చు. కానీ, 98 శాతం స్ట్రైక్ రేట్ ముఖ్యం.. అని జనసేనాని ఇటీవల వ్యాఖ్యానించారు.. పొత్తులో భాగంగా తీసుకోబోయే సీట్ల విషయమై. ‘మనం టీడీపీ వెనుక నడవడంలేదు.. టీడీపీతో కలిసి నడుస్తున్నాం..’ అని కూడా చెప్పారు జనసేనాని.
జనసేన శ్రేణులు, 75 సీట్లను ఆశించాయి. కనీసం 60 అయినా వస్తాయని జనసేనలో చాలామంది అనుకున్నారు. కాదు కాదు, 40 నుంచి 45 మధ్య రావొచ్చన్న సంకేతాలూ కనిపించాయి. కానీ, ఈ ఇరవై నాలుగు సీట్ల లెక్కేంటి.?
మూడు ఎంపీ సీట్లు అంటే చిన్న విషయం కాదు.! ఆయా నియోజకవర్గాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్ని కలుపుకుంటే.. అది పెద్ద వ్యవహారమే. కానీ, అలా కలపలేం కదా.!
2019 ఎన్నికల్లో జనసేన గెలిచింది ఒకే ఒక్క సీటు. జనసేన అధినేత రెండు చోట్లా ఓడిపోయారు. ఓటమి నుంచి జనసేన పాఠాలు నేర్చుకుంది. స్థానిక ఎన్నికల్లో కాస్త బలాన్ని గట్టిగానే చాటుకుంది.
టీడీపీ – జనసేన గెలిస్తే ఏమవుతుందో అధికార వైసీపీకి తెలుసు. అందుకే, పొత్తుని చెడగొట్టడానికి మేగ్జిమమ్ ప్రయత్నిందిగానీ కుదరలేదు.
60 సీట్లు తీసుకుని, 50 శాతం స్ట్రైక్ రేట్ సాధిస్తే ప్రయోజనమేంటి.? పోనీ, 75 శాతం స్ట్రైక్ రేట్ సాధిస్తేనో.! జనసేన ఓట్ల శాతం పెరుగుతుంది ఓవరాల్‌గా.. దీని వల్ల జనసేనకు అదనంగా కలిగే ప్రయోజనం ఏమీ లేదు.
చట్ట సభల్లోకి 24 ప్లస్ 3 అనే నెంబర్‌తో జనసేన ఎంటర్ అయితే, ఆ తర్వాత ఈక్వేషన్స్ అనూహ్యంగా మారిపోతాయ్. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. 24 మంది ఎమ్మెల్యేలతో జనసేనాని గేమ్ ఛేంజర్ అయినా అవ్వొచ్చు. జనసేన శ్రేణులు, ముందు ఆ 24 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను గెలిపించడంపై ఫోకస్ పెట్టాల్సి వుంది.