జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి బలం అభిమానులు.. బలహీనత కూడా అభిమానులే.! ఫలానా వ్యక్తిని పార్టీలోకి తీసుకుంటే తప్పు.! ఫలానా వ్యక్తి పార్టీలోంచి వెళ్ళిపోతే తప్పు.! ఫలానా రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే నేరం.. ఫలానా పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే నేరం.!
ఇదే జనసేనాని పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. సోషల్ మీడియా వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ప్రశ్నాస్త్రాలు పెరిగిపోయాయ్.. అదీ అభిమానులనుంచి. అధికార వైసీపీ నుంచి వెటకారాలు.. టీడీపీ మద్దతుదారుల నుంచి కవ్వింపులు.. వీటినని ఎదుర్కొనాలంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి బలం, బలగం అయిన అభిమానులు.. ఆయనకి అండగా వుండాలి కదా.?
వుంటారు.! చాలామంది వుంటారు.! అందులో చాలామంది ఇలాంటి కీలక సందర్భాల్లో మౌనం దాల్చుతారు. కొంతమంది గోడ మీద పిల్లి వాటం వ్యక్తులు.. ప్లేటు ఫిరాయించేస్తారు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయొద్దు.. హరీష్ శంకర్ దర్శకత్వంలో రీమేక్ సినిమా చేయొద్దు.. ఇలా సాగుతుంటుంది వ్యవహారం.
రాజకీయాల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ విషయమై మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొన్నారు. ఈ రాజకీయాలు తనకు సరిపడవని చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు.
కానీ, పవన్ కళ్యాణ్ గెలుపోటములకు అతీతంగా నిలబడదామనుకున్నారు.. అదీ చాలా బలంగా. ‘నా తమ్ముడు నాలా కాదు..’ అని చిరంజీవి చెప్పారు. మరి, ఆ మెగాభిమానులు, పవన్ కళ్యాణ్‌ని నమ్మాలి కదా.? 24 అసెంబ్లీ సీట్లు, 3 లోక్ సభ సీట్లలో జనసేన పోటీ చేస్తోందనగానే, అభిమానం ముసుగేసుకున్న కొందరు.. పెదవి విరిచేశారు.
175 నియోజకవర్గాలు.. ఒక్కో నియోజకవర్గానికీ సగటున 50 కోట్లు ఖర్చు చేయగల అభ్యర్థులెక్కడున్నారు జనసేన పార్టీకి.! ప్రజల కోసం పనిచేయడానికైతే వుంటారు.. డబ్బు ఖర్చు చేసి, అంతకంత లాభం కోసం ప్రయత్నించేవారు జనసేనాని వెంట నడవలేరు. ఆయన రాజకీయం అలాంటిది.
ఇది వాస్తవం.! ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకున్నా ఇదే నిజం.! సీట్ల ప్రకటన జరిగింది. ఓటు ట్రాన్స్‌ఫర్ అనేది కీలకం ఇప్పుడు. టీడీపీకి జనసేన మద్దతుదారుల ఓట్లు పడాలి. జనసేనకి టీడీపీ మద్దతుదారుల ఓట్లు పడాలి. జనసేన ఓటు బ్యాంకు ఎంత.? టీడీపీ ఓటు బ్యాంకు ఎంత.? ఈ రెండు లెక్కలు తీస్తే, జనసేన అధినేతను ప్రశ్నించే పరిస్థితి వుండదు ఎవరికీ.
ఓటు ట్రాన్స్‌ఫర్ అనేది సజావుగా జరిగి తీరాలి. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది జరుగుతుందా.? జరగాలి.. జరిగి తీరాల్సిందే. ఈ తొందరపాటు గందరగోళం రెండు మూడు రోజుల్లో తగ్గిపోవచ్చుగాక.! అసలు సిసలు రంగులు బయటపడిపోయాయ్ గనుక.. పవన్ కళ్యాణ్ అభిమానుల ముసుగులో, జనసేన మద్దతుదారుల ముసుగులో టైమ్ పాస్ చేసినోళ్ళు సైడయిపోతారు.
జనసేన వైపు నుంచి అంతా క్లియర్‌గా వుంటుంది. కానీ, టీడీపీ పరిస్థితేంటి.? జనసేన విషయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, కృతజ్ఞతాభావంతో వుంటారా.? పార్టీ క్యాడర్‌ని అదే దిశగా జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో గాజు గ్లాసుకి ఓటేసేలా నడిపిస్తారా.? వేచి చూడాల్సిందే.
జనసేనాని అసెంబ్లీలో అడుగుపెట్టి తీరాలి.! అదీ, 98 స్ట్రైక్ రేట్‌తో.. అంటే, 24 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు.. జనసేనకు వుండి తీరాలి 2024 ఎన్నికల తర్వాత. ఇది పవన్ కళ్యాణ్‌ని అభిమానించే నిఖార్సయిన అభిమానులు, జనసైనికుల మాట.!