మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.!
ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ వంగా గీత. ప్రస్తుతం పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేసి, ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. అదే పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరు వేర్వేరు పార్టీలకు చెందిన అభ్యర్థులు వ్యక్తిగత విమర్శలు చేసుకోకుండా వున్నది పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనేనని చెప్పొచ్చేమో. వంగా గీత నుంచి రాజకీయ విమర్శలు, పవన్ కళ్యాణ్ మీద వచ్చాయేమోగానీ, వంగా గీత మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్క విమర్శ కూడా చేయలేదు.
ఇక, వున్నపళంగా ‘మెగాస్టార్ చిరంజీవి’ మీదా, ఆ చిరంజీవి సోదరులపైనా గౌరవం, అభిమానం ఎలా వంగా గీతకు పుట్టుకొచ్చేసినట్లు.? ఇదేమీ మిలియన్ డాలర్ క్వశ్చన్ కాదు. ఏదో మొహమాటానికి ఆమె గౌరవాభిమానాలు ప్రదర్శిస్తున్నారుగానీ, ఆమెకు నిజంగానే అవన్నీ వున్నాయని అనుకోలేం.. మెగా కుటుంబం మీద.
మెగాస్టార్ చిరంజీవిని వైసీపీ నేతలు ఎంతలా తూలనాడారో ఇటీవలి కాలంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ మీద అత్యంత దిగజారుడు వ్యాఖ్యలు చేశారు సాక్షాత్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఒకవేళ చిరంజీవి మీదగానీ, చిరంజీవి కుటుంబం మీదగానీ వంగా గీతకు గౌరవాభిమానాలు వుంటే, వాళ్ళ మీద వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆమె స్పందించి వుండేవారే.
పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ ఓటమి ఖాయమైపోయిందని ఎన్నికల ముందరే ప్రచారం జరిగింది. పోలింగ్ తర్వాత కూడా అదే వాదన ఇంకా బలంగా వినిపిస్తోంది. జనసేనలోకి వంగా గీత జంప్ చేస్తారన్న ప్రచారం ఈనాటిది కాదు. అందుకేనేమో, వంగా గీత ఒకింత సేఫ్ గేమ్ ఆడుతున్నారిప్పుడు.