మంత్రి అంబటి రాంబాబు, సత్తెనపల్లిలో ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. వాస్తవానికి, ఆయన గెలిచే అవకాశం లేదు కాబట్టి, సత్తెనపల్లిలో వేరే అభ్యర్థిని పెట్టాలని వైసీపీ అధినాయకత్వం తొలుత భావించింది. కానీ, అంబటి రాంబాబు ఏదో మాయ చేశారు. వైఎస్ జగన్, ఓకే చెప్పక తప్పలేదాయనకి.
సత్తెనపల్లిలో అంబటి రాంబాబు ఎన్నికల ప్రచారం చప్పగా సాగింది. ప్రజలు ఆయన ప్రచారాన్ని అస్సలు పట్టించుకోలేదు. అంతకు ముందు, గడప గడపకీ వైసీపీ కార్యక్రమంలో, అంబటి రాంబాబుకి సొంత నియోజకవర్గ ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదురయ్యాయి. అయినా, ఆయన తగ్గలేదు.
ఎన్నికల ప్రచారంలోనూ అదే పరిస్థితి. కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ, అంబటి రాంబాబు మీద పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కన్నా లక్ష్మినారాయణ, ఎన్నికల ప్రచారం చాలా పకడ్బందీగా చేసుకున్నారు. ఎలక్షనీరింగ్ కూడా పక్కాగా చేసుకున్నారు.
ఇదే అంబటి రాంబాబుకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఓటమి భయంతో, అంబటి రాంబాబు ఏవేవో మాట్లాడేస్తున్నారు. పలు పోలింగ్ బూతుల్లో రిగ్గింగ్ జరిగిందనీ, ఆయా పోలింగ్ బూతుల్లో రీ-పోలింగ్ నిర్వహించాలనీ డిమాండ్ చేస్తున్నారు అంబటి రాంబాబు.
ఈ క్రమంలో ఆయన తాజాగా కోర్టును ఆశ్రయించారు కూడా. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం, రీ-పోలింగ్ దిశగా సానుకూల నిర్ణయమైతే తీసుకునే అవకాశం లేదు.
రీ-పోలింగ్ అవసరమే లేదని ఇప్పటికే ఎన్నికల సంగం తేల్చి చెప్పింది. కోర్టు నిర్ణయం ఎలా వుంటుందోగానీ, రాజకీయ పరిశీలకుల అంచనా ప్రకారం, అంబటి రాంబాబు కోరిక నెరవేరేలా లేదు.