Pawan Kalyan : ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యొక్క కృషిని ఏ ఒక్కరు తక్కువ చేయలేరు. బీజేపీని ఒప్పించి, తక్కువ సీట్లకే పరిమితం అయ్యి, అనేక చోట్ల పార్టీకి బలమైన అభ్యర్థులు ఉన్నా కూడా పోటీకి దించకుండా చంద్రబాబు నాయుడును సీఎంగా చేయడంలో, ఏపీలో ఎక్కువ స్థాయి ఎంపీ సీట్లు రావడంలో పవన్ కళ్యాణ్ పట్టుదల అమోఘం.
ఆ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకున్నారు. అందుకే ఆయన కోరుకుంటే కేంద్ర కేబినేట్ లోకి కూడా తీసుకునేందుకు ప్రధాని ఆసక్తి చూపించారు అనేది ఇన్‌సైడ్ టాక్. ఇక చంద్రబాబు నాయుడు కేబినేట్ లో కూడా జనసేనకు అగ్రతాంబూలం దక్కబోతుంది.
మోడీ ప్రమాణ స్వీకారం కోసం ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్ జాతీయ మీడియాతో చిట్ చాట్ సందర్భంగా తనకు ఉప ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తి ఉన్నట్లుగా చెప్పాడట. దాంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగడంతో పాటు కీలక శాఖ లను తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం లో చేరక పోవచ్చు అనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుని తన పార్టీని మరింతగా బలోపేతం చేసుకునేందుకు కృషి చేసే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ ఉన్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ఈనెల 12న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఉంటుంది. అదే రోజు ఉప ముఖ్యమంత్రిగా పవన్ ప్రమాణ స్వీకారం చేస్తాడేమో చూడాలి.