తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్( KCR) పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలపై అందరి దృష్టి పడింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత గజ్వేల్ నియోజకవర్గం నుంచి 44 మంది పోటీలో ఉన్నారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. తొలుత ఈ స్థానానికి 114 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. గడువు ముగిసే సమయానికి 70 మంది విత్ డ్రా చేసుకున్నారు. 44 మంది పోటీ చేస్తున్నప్పటికీ టీఆర్ఎస్ నుంచి సీఎం కేసీఆర్, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న తూముకుంట నర్సారెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొంది.
అదేవిధంగా కేసీఆర్ పోటీ చేస్తున్న మరో నియోజకవర్గం కామారెడ్డిలో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 39 మంది ఎన్నికల బరిలో నిలిచారు. నామినేషన్ల పరిశీలన తర్వాత 58 మంది పోటీలో నిలవగా.. ఆఖరి రోజైన బుధవారం 19 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో 39 మంది అభ్యర్థులు కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. కామారెడ్డిలో టీఆర్ఎస్ నుంచి సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy), బీజేపీ నుంచి వెంకట రమణారెడ్డి మధ్య పోటీ నెలకొంది. అయితే, సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డి ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండటంతో అందరి దృష్టి దాని మీదే ఉంది.