12 Years Boy Six pack: కేవలం 12ఏళ్ల వయసుకే సిక్స్ ప్యాక్ బాడీ సంపాదించి వార్తల్లో నిలిచాడు ఓ బుడతడు. తన సిక్స్ ప్యాక్ బాడీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఔరా అనిపిస్తున్నాడు. బ్రెజిల్ (Brazil) కు చెందిన కాజిన్ యో అలియాస్ కార్లోస్ అగస్టో పిటాంగ నెటో. అందరి పిల్లల్లా ఆటలు ఆడకుండా జిమ్ (Gym) లో బాడీ వర్కౌట్లు చేస్తున్నాడు. ప్రస్తుతం నెటో తన కంటే రెండు రెట్లు ఉన్న బరువును అవలీలగా ఎత్తేస్తున్నాడు.
ఉదయం 5.30కల్లా నిద్ర లేచి 5 కిలోమీటర్ల పరుగుతో అతడి రోజు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సిటప్స్, 700 క్రంచ్ లు చేస్తున్నాడు. ప్రతిరోజూ స్కూల్ నుంచి రాగానే హోమ్ వర్క్ పూర్తి చేసి.. జిమ్ కి వెళ్లి రెండున్నర గంటలు అక్కడే గడిపేస్తాడు. స్కూల్ లేకపోతే జిమ్ లోనే గడుపుతాడు. తండ్రి జిమ్ చేయడం చూసి నెటో కూడా అలవాటు చేసుకున్నాడు. నెటో ఆసక్తి చూసి కోచ్, ఫిజియోథెరపిస్ట్, న్యూట్రిషియన్ ను ఏర్పాటు చేశారు తల్లిదండ్రులు.
అయితే.. చిన్న వయసులోనే కఠినమైన కసరత్తులు మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కండరాలు పెంచడంతో ఎముకలు దెబ్బతింటాయని అంటున్నారు. అయితే.. వీటని నెటో తల్లిదండ్రులు ఖండిస్తున్నారు. నిపుణుల పర్యవేక్షణలోనే నెటో వర్కౌట్లు చేస్తున్నాడని అంటున్నారు. క్రియేటైన్, ఒమేగా-3 మాత్రమే ఇస్తున్నట్టు కూడా వారు వెల్లడించారు. ప్రస్తుతం నెటో బరువు, ఎత్తు సాధారణ పిల్లల్లానే ఉన్నా.. బాడీ మాత్రం సిక్స్ ప్యాక్ లా మారిపోయింది.