ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఇంటి నుంచి పాతిక ముప్ఫయ్ కిలోమీటర్ల దూరంలో ఏదన్నా కార్యక్రమానికి హాజరవ్వాల్సి వున్నా, ప్రత్యేక హెలికాప్టర్ వాడేందుకు అనుమతులు ఎడాపెడా దొరికేస్తాయ్.!
ఎంతైనా ముఖ్యమంత్రి కదా.? వ్యవస్థలన్నీ ఆయనకు సలాం కొట్టాల్సిందే.! ఇక, హెలికాప్టర్ ఖర్చు ప్రభుత్వ ఖజానా నుంచే.! అంటే, ప్రజాధనాన్ని వెచ్చించి, ముఖ్యమంత్రిగారు అనవసరపు హంగు, ఆర్భాటాలు ప్రదర్శిస్తారన్నమాట.
అదే, విపక్ష నేతలు సొంత ఖర్చుతో హెలికాప్టర్ ప్రయాణాలు చేయాలంటే, అందుకు ప్రభుత్వం తరఫున అనుమతులు లభించవు.! ప్రత్యేక విమానమైనా, హెలికాప్టర్ అయినా.. విపక్ష నేతలు వాటిని ఉపయోగించాలనుకుంటే, నానా తంటాలూ పడాల్సిందే. ఎందుకీ దుస్థితి.?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనకు ప్లాన్ చేసుకున్నారు. ఇందుకుగాను ప్రత్యేక హెలికాప్టర్‌ని వినియోగించాలనుకున్నారు. కానీ, హెలికాప్టర్ ల్యాండింగ్‌కి అనుమతి లభించలేదు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి.! ఇదో వింత.!
అసలు ఎందుకు అనుమతివ్వలేదు.? అంటే, దానికి ప్రభుత్వం ఏవేవో కారణాలు చెబుతోంది. అందులో ఒక్క కారణమూ సహేతుకంగా లేదన్నది జనసేన ఆరోపణ. హెలికాప్టర్ ప్రయాణానికి అనుమతి లేకపోతేనేం, రోడ్డు మార్గంలో వెళ్ళొచ్చుగా.? అన్నది అధికార వైసీపీ ఇస్తోన్న ఉచిత సలహా.
ఎవరు ఎలా వెళ్ళాలన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుందా.? అధికార పార్టీ నిర్ణయిస్తుందా.? ఇదెక్కడి ఛండాలం.? గతంలో హైద్రాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని, పార్టీ కార్యాలయానికి వెళ్ళాలని జనసేన అధినేత అనుకున్నారు. కానీ, అప్పట్లో చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో జగన్ సర్కారు భయపడి, పవన్ కళ్యాణ్ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేసింది.
రోడ్డు మార్గంలో జనసేనాని వెళితే, బోర్డర్‌లో అడ్డుకుని, ఆంధ్ర ప్రదేశ్‌లోకి రానియ్యకూడదని నానా యాగీ చేసింది. కానీ, ఎప్పుడైతే వేలాదిగా జనసైనికులు అక్కడికి చేరుకున్నారో, ఆ వెంటనే పోలీసులు కంగారు పడాల్సి వచ్చింది. జనసేనాని తన పార్టీ కార్యలయానికి వెళ్ళారు.
ఈసారీ అలాగే పోలీసులు రోడ్డు మార్గంలో ఆటంకాలు కల్పిస్తే ఏంటి పరిస్థితి.? అన్న కోణంలో, భీమవరం పర్యటనను జనసేనాని రద్దు చేసుకుని, మంగళగిరి పార్టీ కార్యాలయంలోనే ‘భీమవరంలో చేపట్టాల్సిన’ సమావేశాల్ని నిర్వహించేస్తున్నారు.
భయం.. మమ్మల్ని చూస్తేనే భయం.. అందుకే, హెలికాప్టర్ ప్రయాణానికి జగన్ సర్కార్ అనుమతినివ్వలేదు.. అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులు, జనసేన నేతలు, సోషల్ మీడియా వేదికగా వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
ఎన్నికల సీజన్ దాదాపుగా వచ్చేసినట్టే. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే, వైసీపీ సర్కారు పప్పులుడకవ్. ఈలోగా, అధికారాన్ని అడ్డంపెట్టుకుని, విపక్షాల్ని నిలువరించాలని.. అన్ని వ్యవస్థల్నీ ఇలా అడ్డగోలుగా వైసీపీ వాడేసుకుంటుందన్నమాట.!