తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టు విషయమై సినీ వర్గాల నుంచీ కొంత మేర స్పందనని చూస్తున్నాం. స్వచ్ఛందంగా ఎవరైనా స్పందిస్తే, అది వారి వారి వ్యక్తిగత అభిప్రాయంగానే చూడాల్సి వస్తుంది. అందులో తప్పేమీ లేదు కూడా.
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ మాట్లాడుతూ, పరిశ్రమకి మేలు చేసిన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబూ వుంటారని ఆయన చెప్పారు. అదే సమయంలో, చంద్రబాబు అరెస్టుపై పరిశ్రమ తరఫున స్పందిచాల్సిన అవసరమూ లేదని అన్నారాయన. సినిమా వేరు, రాజకీయం వేరని దగ్గుబాటి సురేష్ చెప్పుకొచ్చారు.
ఇదిలా వుంటే, సినీ నటుడు విశాల్‌కి మీడియా నుంచి చంద్రబాబు అరెస్టుపై స్పందించాల్సిందిగా కోరుతూ ప్రశ్నలొచ్చాయ్. అదీ ఆయన నటించిన ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ సందర్భంగా. విశాల్ తెలుగు సినీ నటుడు కాదు, తమిళ సినీ నటుడు. విశాల్‌ని మీడియా, చంద్రబాబు అరెస్టుపై స్పందించమని కోరితే.. ఆయన కొంత ఇబ్బంది పడ్డారు.
వ్యక్తిగతంగా, చంద్రబాబు అరెస్టు కొంత బాధ కలిగించిందనీ, ఆ కేసు వివరాల్లోకి తాను వెళ్ళ దలచుకోలేదని విశాల్ వ్యాఖ్యానించాడు. దానిపై అతన్ని ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇదంతా చంద్రబాబు అనుకూల మీడియా అతిగానే చూడాలేమో. పోనీ, విశాల్ తెలుగువాడు.. తమిళంలో సెటిలైన తెలుగువాడు గనుక, ఆయన్ని మీడియా అడిగిందంటే, సర్లే.. అనుకోవచ్చు.
కన్నడ సినీ ప్రముఖుడు రక్షిత్ శెట్టి తన సినిమా ప్రమోషన్ కోసం హైద్రాబాద్ వస్తే, ఆయన్నీ తెలుగు మీడియా, చంద్రబాబు అరెస్టు మీద స్పందించాలని కోరింది. ఈ క్రమంలో రక్షిత్ శెట్టి పడ్డ ఇబ్బంది అంతా ఇంతా కాదు. తెలుగు సినీ పరిశ్రమ స్పందించాల్సిన అవసరం లేదని నిర్మాత సురేష్ బాబు చెప్పాక, తెలుగు మీడియా ఇతర భాషలకు చెందిన సినీ ప్రముఖుల్ని ఇబ్బంది పెట్టాలనుకోవడమే అత్యంత హాస్యాస్పదం.
తెలుగు మీడియాలోనూ, చంద్రబాబు ప్రాపకం కోసం వెంపర్లాడుతున్న వర్గం.. అదే సమయంలో, ఆ చంద్రబాబుని మరింత బదనాం చేయడం కోసం ప్రయత్నిస్తున్న ఇంకో వర్గం.. రెండూ కలిసి, ఇదిగో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయన్నమాట.