బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. నిజానికి ఇది మరీ అంత ఆసక్తికరమైన పరిణామం ఏమీ కాదు. కాకపోతే, కాస్త డిఫరెంట్ అంతే. పునర్నవి భూపాలం వికెట్ పడింది ఈ వారం. ‘మళ్ళీ అవకాశం వస్తే హౌస్‌లోకి వెళతావా.?’ అనే పరమ రొటీన్ క్వశ్చన్ నాగ్ వేయడం, ‘ఖచ్చితంగా వెళతాను..’ అని పునర్నవి చెప్పడం.. అంతా డ్రమెటిక్‌గానే అన్పించింది.
పునర్నవి హౌస్ నుంచి వెళ్ళిపోతేంటే, పెద్దగా ఎవరూ బాధపడలేదు. తనకు బాగా ఇష్టమైన స్నేహితుడు రాహుల్‌ని పునర్నవి చివరి నిమిషంలోనూ హౌస్‌లో దూరం పెట్టేసింది. ఆ తర్వాత, దుఃఖాన్ని రాహుల్ ఆపుకోలేకపోయాడా.? అంటే, ఆ సంగతేమోగానీ.. రాహుల్‌ని ఏడిపించడానికి బిగ్‌బాస్ చాలా ప్రయత్నాలే చేశాడు.
అంతకు ముందు ఫన్ యాక్టివిటీస్ జరిగాయి.. నవరసాలు పండించాల్సిన కంటెస్టెంట్స్, ఆ ‘రసాల’ సంగతేమోగానీ, ‘అతి రసం’ మాత్రం బాగా పండించేశారు. ఎలిమినేషన్ గురించి ముందే తెలిసిపోయినట్లుంది, పునర్నవి చాలా ధీమాగా హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. నిజానికి మహేష్, ఈ వారం ఔట్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ, మహేష్ హౌస్‌లో వుండడమే మంచిదని బిగ్‌బాస్ భావించినట్లున్నాడు.
ఎందుకంటే హౌస్ మేట్స్ మధ్య ‘పుల్లలు’ పెట్టేవాడు కావాలి కదా.! ఈ మధ్య మహేష్‌తో అదే పని చేయిస్తున్నాడు బిగ్‌బాస్. గత రెండు సీజన్లతో పోల్చితే, మూడో సీజన్ పక్కా స్క్రిప్టెడ్ వ్యవహారంలా నడుస్తోంది. కంటెస్టెంట్స్ ఆల్ ఆఫ్ షడెన్ మారిపోతున్నారు. వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. ఆ ప్రవర్తనలో నటన తప్ప, ‘రియాల్టీ’ కన్పించడంలేదు.
‘నీ వెనకే నేనూ వచ్చేస్తున్నా..’ అని రాహుల్, పునర్నవితో ఎలిమినేషన్ సందర్భంగా చెప్పాడుగానీ.. రాహుల్ ఫైనల్ ఫైవ్‌లో వుండబోతున్నాడని సమాచారమ్. ఫైనల్ ఫైవ్‌లో వుండేందుకే అలీ రెజాతో రీ-ఎంట్రీ ఇప్పించారనీ తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఏమైనా జరగొచ్చు.. ఎన్ని జరిగినా, బిగ్‌బాస్ మీద జనంలో ఆసక్తి మాత్రం పెరిగే అవకాశం కన్పించడంలేదు.
