కూకట్‌పల్లి నియోజకవర్గంపై మొదటి నుంచీ జనసేన పార్టీ ప్రత్యేకమైన దృష్టిపెడుతూ వచ్చింది. చివరి నిమిషంలో బీజేపీ, ఆ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా తన్నుకుపోతుందనే ప్రచారం జరిగినా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వ్యూహాత్మకంగా ఆ నియోజకవర్గాన్ని జనసేనకే కేటాయించుకునేలా చేయగలిగారు.
బీజేపీలో అప్పటిదాకా వున్న మమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, జనసేనలోకి వచ్చారు.. జనసేన నుంచి కూకట్‌పల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా టిక్కెట్ సాధించారు. అప్పటిదాకా ఆ టిక్కెట్టుని ఆశించిన జనసేన తెలంగాణ ముఖ్య నేత ఒకరు, ఆ టిక్కెట్టుని త్యాగం చెయ్యక తప్పలేదు.
కూకట్‌పల్లి నియోజకవర్గంలో పోటీ అంటే, ఆర్థికంగానూ బలంగా వుండాలి మరి.! ఈ కోణంలోనే, మమ్మారెడ్డి వైపు జనసేనాని వ్యూహాత్మకంగా మొగ్గు చూపాల్సి వచ్చింది. కూకట్‌పల్లిలో పోటీ చేయాల్సిన జనసేన ముఖ్య నేత, వేరే నియోజకవర్గం వైపు వెళ్ళారు. అది వేరే సంగతి.
ఇక, కూకట్‌పల్లిలో నిన్న జనసేన పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. కనీ వినీ ఎరుగని రీతిలో జనం ఈ బహిరంగ సభకు హాజరయ్యారు. వాస్తవానికి జనసేన నిర్వహించిన బహిరంగ సభ అయినా, బీజేపీ ఈ నియోజకవర్గాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, సభను సక్సెస్ చేసింది.
అంతకు ముందు వరకు కూకట్‌పల్లి విషయమై ఓ మోస్తరు అంచనాలే వుండేవి జనసేన క్యాడర్‌కి. ఇప్పుడు ఆ ఆశలు పదింతలయ్యాయ్. అంచనాలు పెరిగిపోయాయ్. ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన – బీజేపీ కూటమి ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గం కూకట్‌పల్లి.. అని రాజకీయ విశ్లేషకులూ అభిప్రాయపడే స్తాయికి ఇక్కడ ఈక్వేషన్స్ మారిపోయాయ్.
కాంగ్రెస్ అభ్యర్థి దాదాపుగా ఆశలు వదిలేసుకోగా, అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా చేతులెత్తేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.