తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ రోజుల్లో రోజుల వయసున్న చిన్నారి కూడా డయాబెటిస్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. సో, అనారోగ్య సమస్యలకు వయసుతో ముడి పెట్టలేం.!
అనారోగ్య సమస్యలున్నంతమాత్రాన ఆయా వ్యక్తుల్ని చిన్నచూపు చూడాల్సిన పనిలేదు. కానీ, నేను చాలా స్ట్రాంగ్.. అని చెప్పుకునే చంద్రబాబు శరీరంలో ఇన్ని అనారోగ్య సమస్యలున్నాయా.? అన్న చర్చ అయితే ఖచ్చితంగా జరుగుతుంది.
వాస్తవానికి చంద్రబాబుకి వయసు మీద పడింది. ‘నా శరీరానికే వయసు మీద పడిందేమో.. కానీ, మనసు పరంగా నేను యువకుడినే..’ అంటుంటారు చంద్రబాబు. అలా చెప్పడం ఆయనలోని ఆత్మవిశ్వాసాన్ని చెప్పకనే చెబుతుంది. కానీ, మానసికంగా ఎంత ధృఢంగా వున్నా, శరీరం సహకరించకపోతే ఎలా..?
హృద్రోగం సహా అనేకానేక అనారోగ్య సమస్యలు తనకు వున్నాయంటూ చంద్రబాబు సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్టయిన చంద్రబాబు, ప్రస్తుతం మద్యంతర బెయిల్ మీదున్నారు. కంటికి శస్త్ర చికిత్స కోసం మద్యంతర బెయిల్ కోరగా, చంద్రబాబు విజ్ఞప్తిని న్యాయస్థానం మానవీయ కోణంలో పరిగణించింది.
ఇక, ఆ బెయిల్ పొడిగింపు కోసమా.? అని తన అనారోగ్య సమస్యల్ని ఏకరువు పెడుతూ, కోర్టుకు నివేదిక అందించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆ వివరాలు మీడియాకి లీక్ అయ్యాయి. దాంతో, ఇన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చంద్రబాబు, ఇకపై రాజకీయం చేయడం అనవసరమన్న చర్చ అంతటా జరుగుతోంది.
కానీ, కాలు కింద పెట్టలేకపోయినా కరుణానిధి రాజకీయాలు చేశారు. క్యాన్సర్ తనను చంపేస్తున్నా, చాలామంది రాజకీయ ప్రముఖులు కీలక పదవుల్లో కొనసాగారు. ముఖ్యమంత్రులుగానూ పని చేశారు. ఇక్కడ చర్చ అది కాదు. చంద్రబాబు అనారోగ్య సమస్యలపై కోర్టు ఎలా స్పందిస్తుందన్నదే కీలకం.