‘బిగ్ బాస్ మూడో సీజన్’ తెలుగులో ఎలా ‘సాగు’తోందో చూస్తున్నాం. ‘అప్పుడే అయిపోతోందా.?’ అన్న ఆందోళన బిగ్‌బాస్ వ్యూయర్స్‌లో కన్పించడంలేదు. ‘హమ్మయ్య, ఓ పనైపోతుంది..’ అనే ఉపశమనం తప్ప. ఆదివారం షో ముగియనుంది. బరిలో నిలిచిన ఐదుగురు కంటెస్టెంట్స్ శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రెజాలలో ఎవరు విన్నర్ అన్నది అదే రోజు తేలుతుంది.
మొదటి సీజన్‌కి శివబాలాజీ, రెండో సీజన్‌కి కౌశల్ మండా విజేతలయ్యారంటే.. అప్పుడు ఎవరూ ఆక్షేపించలేదు. నిజానికి, ఆయా సీజన్లలో వీక్లీ ఎలిమినేషన్స్ కూడా పక్కాగానే జరిగాయి. ఇప్పుడు మాత్రం గజిబిజి గందరగోళంగా తయారైంది. దాంతో, ‘టైటిల్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి వుంటుంది..’ అనే అభిప్రాయాలు బలంగా విన్పిస్తున్నాయి.
ఇదిలా వుంటే, కంటెస్టెంట్స్ తరఫున మాత్రం విపరీతమైన పబ్లిసిటీ జరుగుతోంది. ఆయా కంటెస్టెంట్స్‌కి మద్దతుగా కొందరు సెలబ్రిటీలు (ఛోటా మోటా సెలబ్రిటీలు మాత్రమే) హడావిడి చేస్తున్నారు. మరోపక్క, ప్రమోషన్స్ కోసం భారీగా కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదెంత నిజం.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. ఇవన్నీ చాలక, సోషల్ మీడియా వేదికగా కంటెస్టెంట్స్ మద్దతుదారులు బూతులతో ఒకరి మీద ఒకరు విరుచుకుపడ్తుండడం గమనార్హం.
నిజానికి, గత సీజన్లతో పోల్చితే.. ఈసారి కంటెస్టెంట్స్‌లో పెద్దగా ఉత్కంఠ కన్పించడంలేదు. అలీ రెజా ఎలిమినేషన్, వైల్డ్‌కార్డ్‌తో రీ-ఎంట్రీ, పునర్నవి – వితిక ఎలిమినేషన్, మహేష్ విట్టా ఎలిమినేషన్ చూశాక.. ఆ ఉత్కంఠ పూర్తిగా చచ్చిపోయిందని అంటున్నారు బిగ్‌బాస్ ఫాలోవర్స్. సో, కంటెస్టెంట్స్‌కి మేటర్ అర్థమయిపోయి వుంటుందనీ, వారి మద్దతుదారులకే అసలు విషయం అర్థం కాక ‘బీపీ’ పెంచేసుకుంటున్నారనీ అనుకోవాలేమో.!
