వనిత విజయ్ కుమార్.. ఈమె సినిమాల్లో కంటే కాంట్రవర్షియల్ కామెంట్స్ తోనే ఎక్కువ సెన్సేషనల్ అయ్యారు. తనపై ఓ గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడంటూ లేటెస్ట్ గా ఆమె చేసిన పోస్ట్ తో మరోసారి వార్తల్లో నిలిచారు.
‘ నిన్న రాత్రి నేను మా సిస్టర్ ఇంటికి వెళ్లి తిరిగి వస్తుంటే ఓ వ్యక్తి నాపై దాడి చేశాడు. నా ముఖంపై గాయం చేసి పారిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయమని మా సోదరి చెప్పింది.అయితే నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. అందుకే నేను ఆ ప్రయత్నం కూడా చేయలేదు. దాడి తర్వాత చికిత్స చేయించుకొని ఆలోచించాను. అతడి మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. అతడు బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రదీప్ ఆంటోనీ మద్దతుదారుడని అనిపిస్తోంది. ఎందుకంటే అతడు రెడ్ కార్డ్ గురించి కామెంట్స్ చేశాడు. అందులో నా సపోర్ట్ కూడా ఉందని మాట్లాడాడు. ప్రస్తుతం నా ముఖంపై తీవ్రమైన గాయం ఉండటంతో కొద్దిరోజులు కెమెరాకి దూరంగా ఉండాలనుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.
అసలు గొడవేంటంటే?
వనిత కూతురు జోవిక తమిళ బిగ్ బాస్ సీజన్-7 లో కంటెస్టెంట్ గా ఉంది. హౌస్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న జోవిక..మరో కంటెస్టెంట్ ప్రదీప్ ఆంటోనీ పై గతంలో విమర్శలు చేసింది. అతడు ఎప్పుడూ వాష్ రూమ్ వద్ద ఉంటున్నాడని ఫలితంగా అమ్మాయిలకి భద్రత లేకుండా పోతుందని ఆరోపించింది. దీంతో హోస్ట్ కమల్ హాసన్ అతనికి రెడ్ కార్డ్ జారీ చేయడంతో ప్రదీప్ మధ్యలోనే హౌస్ నుంచి బయటకి వచ్చేశాడు. ఈ కారణంతోనే ప్రదీప్ అభిమానులు వనితపై దాడి చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వనితకి మద్దతుగా నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ ని కేవలం ఒక ఆట మాదిరిగానే చూడాలని ఇలా దాడి చేయడం సరికాదని పోస్టులు పెడుతున్నారు.