Allu Arjun Birthday Specials: విజయాలు కంటే అపజయాలు ఎక్కువ పాఠాలు నేర్పుతాయి. అలా అని అపజయం కలగాలని.. ఎవరూ కోరుకోరు. కాకపోతే.. ప్రతి రంగంలో.. చేసే ప్రతి ప్రయాణంలో ఎదురుదెబ్బలు తగులుతాయి. వీటి నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నామనేదే ముఖ్యం. ప్రతీ శుక్రవారం జాతకాలు మారే సినిమా ఇండస్ట్రీలో ఇది మరీ ముఖ్యం. ఇందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అతీతమేమీ కాదు. మొదట్లో వరుస సక్సెస్ లు చూసిన బన్నీ తర్వాత కొన్నేళ్ళు ఫ్లాప్స్ కూడా చూసాడు. సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తున్న బన్నీకి వరుస ఫ్లాపులు ఇబ్బంది పెట్టాయి. స్టార్ హీరో టార్గెట్ మరికొన్నేళ్లు ఆలస్యమైంది. అయితే.. సినిమాలే ఫ్లాపులు.. బన్నీ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. నటనలో పరిణితి, డ్యాన్సుల్లో వేగం బన్నీ మరింత రాటుదేలేలా చేశాయి.
నిరాశాజనకమైన ఫలితాలు..
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ తో అల్లు అర్జున్ చేసిన వరుడు డిజాస్టర్ అయ్యింది. క్రిష్ తో చేసిన వేదం కూడా నిరాశే మిగిల్చింది. సెన్షేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ తో చేసిన బద్రీనాథ్ కూడా చేదు ఫలితాన్నే మిగిల్చింది. సుకుమార్ తో ఆర్య-2, బొమ్మరిల్లు భాస్కర్ తో చేసిన పరుగు యావరేజ్ లుగా మిగిలాయి. ఇదంతా అల్లు అర్జున్ ఫేస్ చేసిన బ్యాడ్ పీరియడ్. అయితే.. అయన సినిమాలకు జరిగే బిజినెస్, ప్రేక్షకుల అంచనాల్లో ఏ మార్పూ లేకపోవడం విశేషం. అందుకు కారణం.. పాత్రపై బన్నీ పెట్టే ఫోకస్, చేసే కష్టం, డ్యాన్సుల్లో వైవిద్యం బన్నీని నిలబెట్టాయి. వాటిలో బన్నీ ఫెయిల్ కాకపోవడం.. పాత్రకు తగ్గ మేకోవర్, హెయిర్ స్టయిల్, డ్రెస్సింగ్ అభిమానులను కట్టిపడేసేవి. అదే ఆయన్ను స్టైలిష్ స్టార్ చేశాయి.
మల్లు అర్జున్..
ఇవన్నీ బన్నీని తెలుగు ప్రేక్షకులే కాదు మలయాళంలో కూడా స్టార్ ను చేశాయి. మళయాళీ ఫ్యాన్స్, అసోసియేషన్లు వెలిశాయి. బన్నీ సినిమా తెలుగుతోపాటు మళయాళంలో కూడా విడుదలయ్యాయి. బన్నీ అసలు పేరు అల్లు అర్జున్ అయితే.. అక్కడ మల్లు అర్జున్ అయిపోయాడు. మొత్తంగా కొన్నేళ్లు ఫ్లాపులు చూసినా కూడా బన్నీ తన నటనను ఎప్పటికప్పుడు మెరుగుపరచుకున్నాడు. కథల ఎంపికలో వైవిధ్యం చూపించినా ఫలితం వేరైనా నిరాశ చెందలేదు. ఇన్ని నిరాశా ఫలితాల తర్వాత బన్నీ తానేంటో నిరూపించుకునే అవకాశం కోసం ఎక్కువ సమయం తీసుకోలేదు. ఇదంతా కెరీర్ పై ఉన్న శ్రద్ధ, స్టార్ హీరో కావాలనే తపనే అనేది నిర్వివాదాంశం.