Pawan-Trivikram: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pavan Kalyan),మాటల మాంత్రికుడు త్రివిక్రమ్( Trivikram Srinivas) మధ్య ఉన్న స్నేహం గురించి తెలిసిందే. వీరిద్దరి స్నేహం కేవలం సినిమాల వరకే పరిమితం కాలేదు. వ్యక్తిగత జీవితంలోను త్రివిక్రమ్ కు పవన్ ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంటారు. తాజాగా వీరిద్దరి బంధం గురించి త్రివిక్రమ్ సతీమణి సౌజన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధనుష్ నటించిన ‘సార్’ చిత్రంతో నిర్మాతగా మారిన ఆమె తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఓ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు.
‘పవన్ మా ఇంటికి వస్తే కబుర్లలో పడి ప్రపంచాన్ని మర్చిపోతుంటారు. ఇంటికి వచ్చిన ప్రతిసారి నా చేత్తో ఉప్మా అడిగిమరీ చేయించుకుంటారు ఆయనకి రవ్వ లడ్డు, ఊరగాయ అంటే చాలా ఇష్టం. మధ్యాహ్నం విజిటేరియన్ వంటలే చేయించుకుని తింటారు. మా ఇంట్లో మనిషిలా కలిసిపోతారు. వారిద్దరికి ఒకరంటే మరొకరికి అమితమైన గౌరవం. త్రివిక్రమ్ తాను దాచుకున్న పుస్తకాలను ఎవ్వరికీ ఇవ్వరు. కానీ పవన్ అడిగితే మాత్రం కాదనకుండా తన దగ్గర ఉన్న పుస్తకాలు, పెన్నులు బహుమతిగా ఇచ్చిపుచ్చుకుంటుంటారు’ అని సౌజన్య తెలిపారు.
పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘జల్సా( Jalsa)’, ‘అత్తారింటికి దారేది’, ‘అజ్ఞాతవాసి’ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. గతేడాది వచ్చిన ‘భీమ్లా నాయక్ (Bheemla Naik)’ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించారు.