‘మాచర్ల నియోజకవర్గం’ పేరుతో ఓ సినిమా వచ్చింది కొన్నాళ్ళ క్రితం. నితిన్ హీరో.! సినిమా కదా, కాసిన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటాయ్. కానీ, మాచర్ల నియోజకవర్గంలో జరిగే రాజకీయ హింస మాత్రం నిజం. అది ఇంకోసారి నిరూపితమయ్యింది.
తాజా ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే పిన్నిల్లి రామకృష్ణారెడ్డి, తన అనుచరులతో కలిసి నియోజకవర్గంలో సృష్టించిన గలాటా అంతా ఇంతా కాదు. ఏకంగా, నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా, ఓ ఈవీఎంని పగలగొట్టారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఇంత జరుగుతున్నా, ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నట్లు.? అంతకన్నా ముందు పోలీస్ వ్యవస్థ ఏం చేసినట్లు.?
ఓ పోలింగ్ కేంద్రంలోకి అనుచరులతో కలిసి వెళ్ళి, నానా బీభత్సం సృష్టించారు పిన్నెల్ని రామకృష్ణారెడ్డి. అయితే, పోలింగ్ జరిగిన వారం రోజులకు, ఆ విషయం వెలుగు చూసింది. పిన్నెల్లి ఈవీఎంని పగలగొట్టిన విషయం ఇప్పటిదాకా బయటకు రాలేదంటే, వ్యవస్థలు ఎంత గొప్పగా పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.
గుర్తు తెలియని వ్యక్తి ఈవీఎంని పగలగొట్టినట్లుగా తొలుత కేసు నమోదయ్యిందట. ఎప్పుడైతే వీడియో ఫుటేజ్ బయటపడిందో, ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం విఝయాన్ని సీరియస్‌గా తీసుకుందట. నవ్విపోదురుగాక మనకేటి..? అన్నట్లు తయారైంది వ్యవహారం.
రాయలసీమ ఫ్యాక్షన్‌ని మించి, పల్నాడులో రాజకీయ హింసని చూస్తుంటాం. ఈసారి కూడా అంతకు మించిన స్థాయిలో హింస చోటు చేసుకుంది. తలలు పగిలాయ్, ప్రాణాలు కూడా పోయాయ్.. కానీ, పోయిన ప్రాణాలకు లెక్క లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే, కేసులు పెట్టడానికి కూడా ఎవరూ ముందుకొచ్చే పరిస్థితి లేదక్కడ.
అయినా, ఓ ప్రజా ప్రతినిధి స్వహస్తాలతో ఈవీఎంని పగలగొట్టడమేంటి.? ఎంత కండకావరం.? పైగా, ఈ దాడిని వైసీపీ శ్రేణులు సమర్థిస్తున్నాయి. సదరు పోలింగ్ బూత్ నుంచి వైసీపీ ఏజెంటుని టీడీపీ ఏజెంట్లు తరిమికొట్టారనీ, ఈ క్రమంలోనే నిరసనగా ఎమ్మెల్యే, ఈవీఎంని పగలగొట్టారనీ చెప్పుకుంటున్నారు వైసీపీ మద్దతుదారులు.
ఇంతకన్నా దారుణం ఇంకేముంటుంది.? జరిగిన నేరాన్ని సైతం సమర్థించే స్థాయికి వైసీపీ, కొంతమంది సైకోల్ని కార్యకర్తలుగా, సోషల్ మీడియా వారియర్స్‌గా నియమించినట్లుంది వ్యవహారం. ‘సౌమ్యుడు, మంచివాడు..’ ఇదీ వైఎస్ జగన్, తమ పార్టీ అభ్యర్థుల్ని ఎన్నికల ప్రచారం సందర్భంగా పరిచయం చేసిన తీరు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎంత సౌమ్యుడంటే, ఇదిగో ఈవీఎంలను పోలింగు బూతుల్లోకి వెళ్ళి మరీ పగలగొట్టేంత సౌమ్యుడు.!