స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టయినప్పుడు, రఘురామ కృష్ణరాజుపై హత్యాయత్నం కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు అరెస్టవకూడదు.? అంటూ, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు, ప్రస్తుతం టీడీపీ నుంచి ఉండి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. వైసీపీ ఎంపీగా 2019 ఎన్నికల్లో నర్సాపురం నుంచి గెలిచిన రఘురామ, ఆ తర్వాత వైసీపీకి దూరమయ్యారు. రెబల్ ఎంపీగా, వైసీపీకి కంట్లో నలుసులా తయారయ్యారాయన.
ఈ క్రమంలో రఘురామ మీద ‘రాజద్రోహం’ సహా పలు కేసుల్ని అప్పటి వైసీపీ సర్కారు పెట్టింది. రఘురామని అరెస్టు చేయడం, కస్టోడియల్ టార్చర్.. ఇవన్నీ తెలిసిన విషయాలే. వాటికి సంబంధించి ‘పగ తీర్చుకోవడం’ ఇప్పుడు రఘురామ ముందున్న తక్షణ కర్తవ్యం.
రఘురామ అప్పుడే తన పని మొదలు పెట్టేశారు. తనపై కస్టోడియల్ టార్చర్ జరిగిందనీ, హత్యాయత్నం కూడా జరిగిందనీ ఆరోపిస్తూ రఘురామ ఫిర్యాదు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా పలువురు ఐపీఎస్ అధికారులపై తన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేశారు రఘురామ.
ఇప్పుడు అధికార పీఠమెక్కుతున్నది టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి కావడం, ఆ కూటమి నుంచే అసెంబ్లీకి రఘురామ ప్రాతినిథ్యం వహిస్తున్న దరిమిలా, రఘురామకి ‘న్యాయం’ జరిగే అవకాశం వుందన్నది రఘురామ అభిమానుల వాదన. అదే జరిగితే, ఈ కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చిక్కులు తప్పకపోవచ్చు.
తన మీద జరిగిన కస్టోడియల్ టార్చర్, హత్యాయత్నం కేసులో జగన్‌ని జైలుకు పంపించడమే లక్ష్యంగా రఘురామ పెట్టుకున్న దరిమిలా, ఆయన కోరిక తప్పక నెరవేరుతుందనీ, పంతం నెగ్గించుకోవడానికి రఘురామ ఏ స్థాయికి అయినా వెళతారనీ ఆయన అభిమానులు ఏకంగా బెట్టింగులు కూడా షురూ చేశారు.