కొన్నాళ్ల క్రితం వచ్చిన కమ్ బ్యాక్ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) ఓ డైలాగ్ చెప్తారు. ‘ నేను ట్రెండ్ ఫాలో అవ్వను సెట్ చేస్తాను’ అని.. ఆ మాటని ఆయన కేవలం సినిమాల వరకే కాకుండా నిజ జీవితానికి కూడా అప్లై చేస్తున్నారు.
ఎన్నికల హడావుడి మొదలై ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కన్ఫామ్ అయినప్పటి నుంచి ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ సెట్ చేశారు.. ‘ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ అంటూ పోస్టులు పెట్టి ఆ మాటని తెగ వైరల్ చేశారు.
ఎలక్షన్స్ మొత్తంగా ఆ ట్రెండ్ భలే వైరల్ అయింది. పవన్ కూడా తన అభిమానుల కోరికను తీర్చారు. పిఠాపురం లో పవన్ 64.87% ఓటు షేర్ తో 70,279 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 21 సీట్లు గెలవడంతో జనసేన పార్టీకి కూటమిలో ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవుతారని ఊహాగానాలు వినిపించడంతో మళ్లీ సోషల్ మీడియాలో ‘ డిప్యూటీ సీఎం గారి తాలూకా’ అంటూ పోస్టులు వైరల్ అయ్యాయి.
ఇప్పుడు నిజంగానే ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో జనసేన కేవలం ఒక్క రాజోలు స్థానాన్ని మాత్రమే దక్కించుకోగలిగింది. ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే కూడా వైఎస్సార్సీపీలో చేరిపోయారు. దీంతో జీరో నుంచి తిరిగి తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన జనసేన 2024 ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా పోటీ చేసిన 21 స్థానాల్లోనూ అఖండ విజయం సాధించింది.
కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ ను డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీ, పర్యావరణ, అటవీ శాఖలు వరించాయి. దీంతో ఈసారి ‘డిప్యూటీ సీఎం గారి తాలూకా’ అని తన అభిమానులు సగర్వంగా చెప్పుకునేలా పవన్ చేసి చూపించారు.