Balakrishna : నందమూరి బాలకృష్ణ… ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్ లో రారాజుగా వెలుగు వెలుగుతున్న బాలయ్య గత పదేళ్లుగా రాజకీయాల్లో ఎదురు లేకుండా దూసుకు పోతున్నాడు. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఎంతో మంది రాజకీయాల్లో రాణించారు. అయితే వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది మాత్రం బాలయ్య మాత్రమే అంటూ ఆయన ఫ్యాన్స్ గంట కొట్టి మరీ చెబుతున్నారు. ఈ అద్భుతమైన రికార్డును ప్రస్తుతం బాలయ్య ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
నేడు బాలకృష్ణ పుట్టిన రోజు. ప్రతిసారి మాదిరిగా కాకుండా ఈ పుట్టిన రోజు చాలా స్పెషల్ అనడంలో సందేహం లేదు. హీరోగా వరుసగా అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన బాలకృష్ణ ఎమ్మెల్యేగా వరుసగా మూడు సార్లు హిందూపురం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాడు.
ఒకే ఏడాది రెండు హ్యాట్రిక్ లు కొట్టిన బాలయ్య జీవితంలో ఇది అత్యంత కీలక సమయం అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ సారి చంద్రబాబు నాయుడు యొక్క మంత్రి వర్గంలో బాలయ్య కు చోటు దక్కడం ఖాయం అనే చర్చ కూడా జరుగుతుంది.
ఇదే సమయంలో వరుసగా బాలయ్య సినిమాలు చేస్తాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బాబీ దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. వీరమాస్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి.
మరో వైపు సింహా, లెజెండ్, అఖండ వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన దర్శకుడు బోయపాటి శ్రీను తో మరోసారి బాలకృష్ణ సినిమా కి సిద్ధం అవుతున్నాడు. నేడు పుట్టిన రోజు సందర్భంగా ఆ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, కీలక విషయాలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయట.
డబుల్ హ్యాట్రిక్ కొట్టి ఇండస్ట్రీ లో మరియు రాజకీయాల్లో దూసుకు పోతున్న నందమూరి బాలకృష్ణ ముందు ముందు కూడా ప్రేక్షకులను అలరించడంతో పాటు, రాజకీయాల్లో మరింతగా క్రియాశీలక పాత్ర పోషించాలని ఆయన అభిమానుల తరపున, మా టీం తరపున కోరుకుంటూ… హ్యాపీ బర్త్ డే బాలయ్య బాబు.