వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిది నెంబర్ వన్ పొజిషన్ అయితే, ఖచ్చితంగా రెండో పొజిషన్ విజయ్ సాయిరెడ్డిదే. అక్రమాస్తుల కేసులో జగన్ ఎ-1 నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటోంటే, ఎ-2 నిందితుడిగా విజయ సాయిరెడ్డి పేరు రిజిస్టర్ అయ్యింది. నిజానికి ఆర్ధిక వ్యవహారాల్లో అత్యంత నిష్ణాతుడైన విజయ సాయిరెడ్డి వల్లనే వైఎస్ జగన్ ఆస్థులు ఇంతలా కూడగట్టారన్నది అంతటా వినిపించే ఓ అభిప్రాయం. ఆర్ధిక సలహాదారుడు కాస్తా, రాజకీయాల్లో కుడి భుజంగా మారి వైఎస్ జగన్‌కి వెన్నంటే ఉంటున్నారు విజయ సాయిరెడ్డి.
2014లో తృటిలో అధికారం దక్కించుకోలేకపోయామన్న భావనతో ఇప్పటికీ ఆనాటి ఆ ఫలితాన్ని జీర్ణించుకోలేకపోతున్న వైఎస్ జగన్ ఈసారి ఎలాగైనా ముఖ్యమంత్రి పీటమెక్కుతానని ధీమాతో ఉన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే, విజయ సాయిరెడ్డి ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు చేపడతారనీ ఓ ప్రచారం రాజకీయ వార్తల్లో ఉంది. ప్రస్తుతం విజయ సాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా పని చేస్తున్నారు. అన్నీ కలిసొచ్చి, వైఎస్సార్ సీపీకి అధికారం దక్కితే, వైఎస్ జగన్ తన మంత్రివర్గంలో విజయ సాయిరెడ్డికి ప్రాముఖ్యత ఇచ్చే అవకాశం లేకపోలేదు. కానీ, విజయ సాయిరెడ్డి విషయంలో కొన్ని రిజర్వేషన్లు ఉన్నాయి వైఎస్ జగన్‌కి.
జాతీయ స్థాయిలో రాజకీయ వ్యవహారాలు చక్కబెట్టగల నేర్పరితనం చాలా తక్కువ కాలంలోనే విజయ సాయిరెడ్డి సంపాదించారు. ఆ అనుభవం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో అవసరం. ఆ అనుభవంతోనే జాతీయ స్థాయిలో చాలా వ్యవహారాలు పార్టీ తరపున చక్కబెట్టారాయన. పొరుగు రాష్ట్రంలోని అధికార పార్టీ టీఆర్‌ఎస్‌తోనూ, అలాగే జాతీయ స్థాయిలో భారీతీయ జనతా పార్టీతోనూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సన్నిహిత సంబంధాలేర్పడడంలో కీలక భూమిక విజయ సాయి రెడ్దిదే. ఈ అనుభవం రాష్ట్ర స్థాయిలో కంటే, జాతీయ స్థాయిలోనే వైఎస్సార్‌సీపీకి ఎక్కువ ఉపయోగపడుతోంది.
ఎలా చూసినా, విజయ సాయి రెడ్డి ఢిల్లీ రాజకీయాలకే పరిమితం కావచ్చు, దాని అర్ధం, విజయ సాయి రెడ్డికి మరే ఇతర పదవీ వైఎస్ జగన్ ఇవ్వబోవడం లేదనీ కాదు. కేంద్రంలో తమ ప్రమేయంతోనే ఏ ప్రభుత్వమైనా అధికార పీటమెక్కుతోందనే గట్టి నమ్మకంతో ఉన్న వైఎస్ జగన్ ఆ ప్రభుత్వంలో విజయ సాయి రెడ్డిని భాగస్వామ్యం చేస్తారట. అంటే విజయ సాయి రెడ్డికి రాష్ట్ర క్యాబినెట్‌లో ఛాన్స్ కాదు, జాతీయ క్యాబినెట్‌లో ఛాన్స్ తప్పనిసరి అనే భావనలో వైఎస్ జగన్ ఉన్నారేమో. అయితే మార్చి 23న వచ్చే ఫలితాల్ని బట్టి ఈక్వేషన్స్ మారిపోతాయి. అప్పటిదాకా ఇలాంటి ఊహాజనిత పదవుల్లో విజయ సాయిరెడ్డి ఊగుతూండచ్చు.
ఈ లోగా ఖాళీగా ఉండడం ఎందుకని సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతున్నారాయన. చంద్రబాబు అంటే అదో టైపు అభిమానం ఈయనకి. సీనియర్ పొలిటీషియన్ అన్న కనీస గౌరవం కూడా చంద్రబాబుకు విజయ సాయి రెడ్డి ఇవ్వడం లేదు. ఇప్పుడున్న రాజకీయాల్లో ఇలాంటి వింత పోకడ సర్వసాధారణమే కావచ్చు కాక. కానీ ఒకప్పటి ఛార్టెడ్ అకౌంటెంట్‌గా ఆయన తను హుందాతనాన్ని కాపాడుకోవల్సి ఉంది. రాజకీయాల్లో అంచనాలు తారుమారవడం సర్వసాధారణం. వైసీపీ అంచనాలు తారుమారైతే పార్టీలోనే విజయ సాయి రెడ్డి భవిష్యత్తు ఏంటో ఊహించడం కష్టం.
