మెగా హీరో వరుణ్ తేజ్ ఇప్పుడు వరస విజయాలతో ఊపు మీదున్నాడు. తన గత చిత్రాలు ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ భారీ విజయాలు సాధించడంతో ఇప్పుడు వరుణ్ కు క్రేజ్ బాగుంది. మిడ్ రేంజ్ హీరోలలో కన్సిస్టెంట్ గా హిట్స్ ఇస్తున్న హీరోలలో వరుణ్ ముందు వరసలో ఉంటాడు. గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్ తేజ్ ఒక స్పోర్ట్స్ డ్రామా చేయబోతున్న సంగతి తెల్సిందే.
బాక్సింగ్ నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రాన్ని అల్లు బాబీ, సిద్దు ముద్దలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మొదట్లో మొదలవుతుంది. ఇప్పటికే వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం సన్నద్ధమవుతున్నాడు. బాక్సర్ గా కనిపించనున్నాడు కాబట్టి ఫిట్ గా ఉండేందుకు కసరత్తులు చేస్తున్నాడు.
లుక్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు భారీ బడ్జెట్ ను కేటాయించారట నిర్మాతలు. స్పోర్ట్స్ డ్రామా కాబట్టి ఆ మాత్రం పెట్టడం సమంజసమే అనుకుంటున్నారట.
వరుణ్ గత చిత్రం గద్దలకొండ గణేష్ 25 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయగా ఈ స్పోర్ట్స్ డ్రామాకు ఏకంగా 35 కోట్ల రూపాయలను బడ్జెట్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ క్రేజ్ ఇప్పుడు బాగుండడంతో బిజినెస్ బాగా జరుగుతుందనే నిర్మాతలు నమ్ముతున్నారు. మరి ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాన్నిస్తుందో తెలియాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే.
