ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు అనారోగ్య సమస్యలతో బెయిల్ పొందిన సంగతి తెలిసిందే. తొలుత మద్యంతర బెయిల్ రాగా, ఆ తర్వాత సాధారణ బెయిల్ లభించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
రాజకీయాలన్నాక ఆరోపణలు సహజం.! పరిపాలన చివరి రోజుల్లో చంద్రబాబుని వ్యూహాత్మకంగా వైసీపీ సర్కారు అరెస్టు చేయించడం వెనుక రాజకీయం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ తరహా అరెస్టులు ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో చాలానే జరిగాయ్.
సరే, అరెస్టుల్ని కోర్టులు ఎలా పరిగణిస్తాయి.? ఆయా కేసులు కోర్టులో ఏమవుతాయి.? అన్నది వేరే చర్చ.! ఎవరికీ ఇక్కడ ‘గొప్ప మనిషి’ అని సర్టిఫికెట్ ఇవ్వలేం. ఇది రాజకీయం.!
తెలంగాణ తాజా మాజీ ముఖ్యమంత్రి కేసీయార్, తుంటె ఎముక సమస్యలో ఆసుపత్రిలో చేరారు. ఆ వెంటనే తెలంగాణ తాజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీయార్ ఆరోగ్య పరిస్థితిపై ఉన్నత స్థాయిలో ఆరా తీశారు.
ప్రతిపక్ష నేతగా మారిన కేసీయార్ ఆరోగ్యంపై ప్రభుత్వం తరఫున ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రతలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉన్నతాధికారులను ఆదేశించారు.
కేసీయార్ – రేవంత్ రెడ్డి కంటే కఠినమైన రాజకీయ ప్రత్యర్థులా వైఎస్ జగన్ – చంద్రబాబు అన్న చర్చ తెరపైకి రావడం సహజమే. చంద్రబాబు ఆరోగ్యంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాకబు చేయలేదు. పైగా, వెటకారం చేయించారు మంత్రులతో.
అందుకే, తెలంగాణ పద్ధతి వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేరు అనేది.!