ఓ వైపు ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ, ఇంకో వైపు తెలంగాణలోని అధికార పార్టీ.. టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌ని కార్నర్ చేసేశాయి. ఆయన మీద ఇప్పుడు సీరియస్ కేసులే నడుస్తున్నాయి. కొన్నాళ్ళపాటు అజ్ఞాతంలోకి వెళ్ళిన రవిప్రకాష్, కొద్ది రోజుల క్రితం అజ్ఞాతం వీడి, పోలీసుల విచారణకు హాజరైన విషయం విదితమే. తెలుగు మీడియాలో తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించుకున్న రవిప్రకాష్, రేపో మాపో అరెస్ట్ అవడం ఖాయమన్న ప్రచారం గత కొంత కాలంగా జరుగుతోంది.
అయితే, రవిప్రకాష్ అరెస్ట్ అయ్యే అవకాశాలే లేవని తాజాగా ఓ బలమైన అభిప్రాయం ప్రచారంలోకి వచ్చింది. టీవీ9 సంస్థలో మారిన పరిణామాల నేపథ్యంలో రవిప్రకాష్ ముందే అలర్ట్ అయ్యాడట. తనపై, రెండు రాష్ట్రాల్లోనూ కేసులు నమోదవ్వొచ్చనీ, రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలూ తన మీద కక్ష కట్టవచ్చునని భావించి, జాతీయ స్థాయిలో తన సొంత నెట్‌వర్క్‌ని మరింత పటిష్టం చేసుకున్నారట రవిప్రకాష్. ఆ జాతీయ స్థాయి నెట్‌వర్క్ కారణంగానే రవిప్రకాష్, ఇన్ని రోజులపాటు సేఫ్‌గా అజ్ఞాతంలో వుండగలిగినట్లు తెలుస్తోంది.
తనకు అత్యంత సన్నిహితుడైన కొందరి సలహా, సూచనల మేరకు మాత్రమే రవిప్రకాష్, పోలీసుల విచారణకు హాజరవుతున్నారనీ, ఒకవేళ అరెస్ట్ అయినా.. వెంటనే బెయిల్ దొరకడం ఖాయమనే ధీమాతో ఆయన వున్నారనీ తెలుస్తోంది. ఇదిలా వుంటే, ఓ బలమైన రాజకీయ శక్తి రవిప్రకాష్‌ని కాపాడుతోందన్నది తాజా ఖబర్.
ప్రస్తుతం పరిస్థితులు ఎలా వున్నా, మళ్ళీ రవిప్రకాష్ బౌన్స్ బ్యాక్ అవడం పెద్ద కష్టమేమీ కాదు. కొత్తగా ఛానల్ పెట్టినా, ప్రస్తుతం నడవలేక ఎలాగోలా నెట్టుకొస్తోన్న ఏదో ఒక ఛానల్‌ని తన ఆధీనంలోకి తీసుకున్నా రవిప్రకాష్ మళ్ళీ మీడియా రంగంలో సంచలనాలు సృష్టించగలడు. ఆ నమ్మకం చాలామందిలో వుంది. ఓ ప్రముఖ పార్టీకి చెందిన పెద్దలు ఈ విషయాన్ని గుర్తించి, రవిప్రకాష్‌ని కాపాడుతున్నారంటూ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఇంతకీ ఆ రాజకీయ పార్టీ ఏంటి.? అంటే, ప్రస్తుతానికైతే సస్పెన్స్.
ఒక్కటి మాత్రం నిజమట. అతి కొద్ది రోజుల్లోనే రవిప్రకాష్ బౌన్స్ బ్యాక్ అవనున్నారనీ, మీడియా రంగంలో అనూహ్యమైన స్థాయికి మళ్ళీ ఆయన ఎదగబోతున్నారనీ, ఈసారి రవిప్రకాష్ పవర్‌ని తట్టుకోవడం ఎవరికైనా కష్టమేననీ అంటున్నారు. నిజమేనా? అంతటి గొప్ప అవకాశం రవిప్రకాష్‌కి ఇచ్చేదెవరు? ఈలోగా రవిప్రకాష్‌ని ప్రస్తుతం వున్న కేసుల నేపథ్యంలో అరెస్ట్ చేసి, అసలు మీడియాలోనే కన్పించకుండా చేసేస్తేనో! ఏమో, ఏదైనా జరగొచ్చు.