సతీష్ వేగేశ్న రచయితగా తెలుగు సినీ పరిశ్రమకు సుపరిచితమైనా, దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులు అందరికీ దగ్గర అయ్యింది శతమానం భవతి చిత్రంతో. 2017 సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలతో పోటీగా, చిన్న సినిమా ‘శతమానంభవతి’ కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ రెండు పెద్ద సినిమాలూ (గౌతమి పుత్ర శాతకర్ణి, ఖైదీ నెంబర్ 150) సంచలన విజయాల్ని అందుకోవడంతో, ఆ విజయాల నడుమ ‘శతమానం భవతి’ ఎవరికీ కనిపించదని చాలామంది సినీ జనాలే అభిప్రాయపడ్డారు. అయితే సినిమాలో ‘విషయం’ వుండాలేగానీ, తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరించి తీరతారన్న నమ్మకం విడిచిపెట్టలేదు ‘శతమానంభవతి’ టీమ్. చివరికి ‘శతమానం భవతి’ టీమ్ నమ్మకమే గెలిచింది. రెండు పెద్ద విజయాల నడుమ, ‘శతమానంభవతి’ మంచి సినిమాగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంది.
అసలు ‘శతమానం భవతి’ సినిమాలో ఏమున్నాయి.? అని చూస్తే, చాలానే కన్పిస్తాయి. నటీ నటుల చక్కటి నటనా ప్రతిభ, మంచి సంగీతం, అద్భుతమైన సినిమాటోగ్రఫీ, వీటన్నిటికీ మించి ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకునే డైలాగ్‌లు, స్క్రీన్ పైనుంచి తల తిప్పుకోనివ్వని గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే.. ఇవన్నీ ‘శతమానం భవతి’ సినిమాలో వున్నాయి. కుటుంబ ‘విలువల’ గురించి దర్శకుడు ఎంతో బాధ్యతగా చెప్పిన ‘పాయింట్’ అన్ని వయసుల ప్రేక్షకులకీ, మాస్ – క్లాస్ సెంటర్స్ ఆడియన్స్‌కీ బాగా అర్థమయ్యింది. అదే ‘శతమానం భవతి’ సినిమా విజయానికి కారణం.
ఈ సినిమా తర్వాత దర్శకుడు సతీష్ వేగేశ్న ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాని రూపొందించాడు. ఇందులోనూ తన ట్రేడ్ మార్క్ కుటుంబ విలువల్ని చాల హృద్యంగా చూపించాడు. అయితే ఒక వర్గానికి మాత్రమే ఆ చిత్రం నచ్చడంతో, అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయింది శ్రీనివాస కళ్యాణం. ఇప్పుడు ‘శ్రీనివాస కళ్యాణం’ తర్వాత మరో మంచి కథ కోసం ఈ దర్శకుడు ఒకింత గ్యాప్ తీసుకున్నట్లు కన్పిస్తోంది.
స్వతహాగా గోదావరి అందాల్ని ఇష్టపడే సతీష్ వేగేశ్న, ప్రస్తుతం అక్కడే తదుపరి చేయబోయే చిత్రాల కోసం అద్భుతమైన కథల్ని సిద్ధం చేసే పనిలో బిజీగా వున్నారట. అతి త్వరలోనే సతీష్ వేగేశ్న నుంచి ఓ మంచి సినిమాని చూడబోతున్నామన్నది నిస్సందేహం.
గతంలో సతీష్ వేగేశ్న, పలు విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేశారు. రాజా, కబడ్డీ కబడ్డీ, నా ఆటోగ్రాఫ్, గబ్బర్ సింగ్, సుబ్రమణ్యం ఫర్ సేల్ వంటి సినిమాలకు పనిచేసి, ఆయా చిత్రాలు ఘనవిజయం సాధించడంలో తనవంతు పాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ సినిమాకే కాదు, సాయిధరమ్ తేజ్‌కి తొలి సూపర్ హిట్ సినిమా అయిన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాకీ సతీష్ వేగేశ్న స్క్రీన్ ప్లే అందించడం గమనార్హం. ముప్పలనేని శివ, ఈవీవీ సత్యనారాయణ వంటి మేటి దర్శకుల వద్ద గతంలో పనిచేశారాయన. సీనియర్ దర్శకులతో ఆ అనుభవం, దాంతోపాటుగా యువ దర్శకులతో పనిచేసిన కొత్త అనుభవం వెరసి, సతీష్ వేగేశ్న సినిమాల్లో పాత – కొత్త కలయిక అత్యద్భుతంగా కనిపిస్తుంటుంది.
‘శతమానం భవతి’ సినిమాతో లెక్కలేనన్ని ప్రశంసలు, లెక్కకు మిక్కిలిగా అవార్డులు అందుకున్న సతీష్ వేగేశ్న.. జాతీయ అవార్డుల్లోనూ తనదైన ముద్ర వేసిన విషయం విదితమే. 27 సంవత్సరాల తర్వాత ఒక తెలుగు చిత్రం స్వర్ణకమలం అందుకోవడం ‘శతమానం భవతి’కే దక్కింది. అలాగే ఇక్కడ అయిదు నంది అవార్డుల్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ అలాంటి మంచి కథతో, ఓ మంచి విజయంతో వేగేశ్న సతీష్ మళ్ళీ మన ముందుకు వస్తారని ఆశిద్దాం.







