టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు మీద పెద్ద కుట్రే జరుగుతోంది. సినిమా రిలీజ్ తొలుత ఏప్రిల్ నెలాఖరుకి అనుకున్నా, ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజు (మే 9న) విడుదల చేయాల్సి వచ్చింది. టిక్కెట్ ధరల పెంపు సహా అనేక విషయాల్లో ‘మహర్షి’ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్న విషయం విదితమే. పేరుకే ముగ్గురు నిర్మాతలు.. కానీ, మొత్తం బాధ్యత దిల్ రాజు మీదనే పడింది. సినిమా ప్రమోషన్‌లో ఎక్కువగా దిల్ రాజే కన్పించారు. ఇన్ని సమస్యల్ని దిల్ రాజు ఒక్కరే అత్యంత సమర్థవంతంగా పరిష్కరించగలిగినా, టిక్కెట్ల ధర పెంపు విషయమై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో ముందే ఇతర నిర్మాతలూ సంప్రదింపులు జరిపి వుంటే విడుదలకు ముందు ఇన్ని వివాదాలు వచ్చి వుండేవి కాదు.
సినిమా విడుదలయ్యాక ‘మహర్షి’కి మరో పెద్ద సమస్య ఎదురయ్యింది. సాధారణంగా పెద్ద సినిమాలన్నిటికీ దాదాపు ఈ సమస్య తప్పడంలేదు. దీన్ని కొత్త ట్రెండ్ అనాలో, ఇంకేమన్నా అనాలో అర్థం కావడంలేదెవరికీ. ఆ సమస్య ఏంటంటే, విడుదల సమయంలో సినిమా లీక్ అవడం. అమెరికాలో ప్రీమియర్స్ పడటమే తరువాయి, ఇంటర్నెట్‌లో ‘మహర్షి’ సినిమాకి సంబంధించిన “సన్నివేశాల వీడియోలు” ఇంటర్నెట్‌లోకి వచ్చేశాయి. సీన్లు లీక్ అవడంతో ‘మహర్షి’పై ఆసక్తి సన్నగిల్లిపోయేలా చేసింది. రాత్రంతా సోషల్ మీడియాలో ‘మహర్షి’ వీడియోలు హల్‌చల్ చేసినా, తెల్లారేసరికి వాటి ప్రవాహం కొంత తగ్గింది.
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ ద్వారా ఈ సీన్లు వేగంగా సర్క్యులేట్ అయిపోతున్నాయి. మహేష్ ఇంట్రడక్షన్ సీన్ నుంచి శుభం కార్డు పడేదాకా దాదాపు అన్ని సన్నివేశాలూ ఇంటర్నెట్‌లో లీక్ అయిపోవడం గమనార్హం. దీన్ని లీక్ అనండి, పైరసీ అనండీ.. పేరు ఏదైతేనేం ‘మహర్షి’ మరో పెద్ద కుట్రకు బలైపోయినట్లే కనిపిస్తోంది. ఓ పక్క టిక్కెట్ల ధర పెంపుతో సామాన్య ప్రేక్షకుడు సినిమాని థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపని పరిస్థితి. ఇంకోపక్క ముందే లీకైపోతున్న సీన్స్‌తో, వున్న ఆసక్తి కూడా సన్నగిల్లిపోతున్న దుస్థితి. వెరసి, ‘మహర్షి’ వసూళ్ళ పరంగా భారీగా నష్టపోవచ్చని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అన్న ప్రశ్న చుట్టూ ‘బాహుబలి-2’ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘బాహుబలి-2’ విడుదలవుతూనే, ఆ సీక్రెట్ రివీల్ అయిపోయింది. సన్నివేశాలతో సహా ఇంటర్నెట్‌లో లీక్ అయిపోయాయి అప్పట్లో. అప్పుడే చాలామంది ఇకపై ఇలాంటి పైత్యానికి అడ్డుకట్ట వేయాలని ప్రతిపాదించారు. కానీ, ఎవరూ దాన్ని సీరియస్‌గా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. అయితే, ట్రెండ్ మారింది. చేతిలో మొబైల్ ఫోన్ స్మార్ట్‌గా అందుబాటులో వున్నప్పుడు, వీటిని అడ్డుకోవడం అంత తేలిక కాదు. సీరియస్ యాక్షన్ వుంటేనే ఈ తరహా లీకులకు అడ్డుకట్ట వేయగలం. కోట్లు వెచ్చించి సినిమా తీసే నిర్మాతలకు అప్పుడే ప్రయోజనం చేకూరుతుంది.
ఏదిఏమైనా భారీ అంచనాల నడుమ విడుదలైన ‘మహర్షి’ సినిమాకి ఈ లీకుల బెడద గట్టిగానే షాక్ ఇచ్చే అవకాశాలున్నాయి. తొలి రోజు వసూళ్ళపై కొంతమేర ఈ ప్రభావం వుంటుందని అంచనా వేస్తున్నారు. టాక్ బావుండి, సినిమా నిలబడినా లీకుల ‘నష్టం’ భారీస్థాయిలోనే వుండొచ్చు.