సీనియర్ పొలిటీషియన్ జేసీ దివాకర్ రెడ్డి, సొంత పార్టీకి తలనొప్పి తీసుకురావడంలో దిట్ట. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడూ ఆయనదీ అదే తీరు. టీడీపీలోకి వచ్చాక ఇంకాస్త చాదస్తం పెరిగింది. చంద్రబాబును పొగుడుతూ తిట్టడంలో, జేసీ దివాకర్ రెడ్డి చాణక్యం, తెలుగుదేశం పార్టీ నేతలకే మింగుడు పడడంలేదు. ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడం కష్టం.. అని జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడో చెప్పారు. అదే జరిగిందిప్పుడు. అలా చంద్రబాబును పలు వేదికలపై ఇరకాటంలో పెడుతూనే, చంద్రబాబును పొగుడుతుంటారు జేసీ దివాకర్ రెడ్డి. తాజాగా ఎన్నికల ఫలితాలపై జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తెలుగు తమ్ముళ్లు షాక్‌కి గురయ్యారు.
నియోజక వర్గానికి 50 కోట్లు ఖర్చయ్యాయని జేసీ మీడియా ముందు చెప్పడంతో ఈ విషయమై చంద్రబాబుకు కొందరు తెలుగు తమ్ముళ్లు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి పక్కలో బళ్లెంలా మారిన జేసీ వ్యవహార శైలిపై చంద్రబాబు కూడా ఆందోళనగానే ఉన్నారట. కానీ జేసీ దివాకర్ రెడ్డితో చంద్రబాబుకు చాలా అవసరాలున్నాయి. అందుకే ఆయన్ని ఏమీ అనలేకపోతున్నారు. నియోజక వర్గానికి 50 కోట్ల వ్యవహారంపై కూడా చంద్రబాబు, జేసీని ప్రశ్నించారట. దానికి జేసీ దివాకర్ రెడ్డి నుండి నిర్లక్ష్యంతో కూడిన సమాధానం వచ్చిందట. తాను నిజమే మాట్లాడానని జేసీ చెబితే, ఆ నిజాలు మన పార్టీకి చేటు చేయకూడదనీ, చంద్రబాబుకు జేసీకి సూచించినట్లు తెలుస్తోంది. అయితే, గుమ్మడి కాయల దొంగా.. అనకుండానే భుజాలు తడుముకోవడమేంటని చంద్రబాబుపై జేసీ అసహనం వ్యక్తం చేశారట.
అయినా ‘నేను టీడీపీ గెలుస్తుందనే కదా చెప్పాను.. చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని అన్నాను కదా.. ప్రతిపక్షాన్ని విమర్శించాను కదా.. అయినా ఎందుకు సొంత పార్టీ నేతలు తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు..’ అని జేసీ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. ఇదిలా ఉంటే, జేసీ అంతర్గత సర్వేల్లో తెలుగు దేశం పార్టీ గట్టెక్కడం కష్టమేనని తేలిందనీ, ఆ విషయాన్నే ఆయనే లీక్ చేశారనీ, టీడీపీ నేతలు కొందరు మీడియాకి ఉప్పందిస్తున్నారు, అధినేతకు సమాచారమిస్తున్నారు. జేసీ మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీలో ఈ మధ్య చాలా మంది నేతలు ఇలాగే చంద్రబాబుకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు.
చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఓ సీనియర్ నేత ఫలితాలెలా ఉంటాయనే దానిపై విశ్లేషించి, ఊహించి టీడీపీ పరిస్థితి కష్టమే అని తేల్చడమే కాదు, వైసీపీతో టచ్‌లోకి కూడా వెళ్లారట. ఉత్తరాంధ్రకు చెందిన ఓ ముఖ్య నేత టీడీపీ నుండి జనసేనలోకి వెళ్లేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారట. ఇలాంటోళ్లు టీడీపీలో చాలా మందే ఉన్నారనీ మే తర్వాత రాజకీయాలు అనూహ్యంగా మారతాయనీ, జంపింగ్ జపాంగ్‌ల్లో జేసీ లాంటి నేతలు చాలా మందే ఉంటారనీ ప్రతిపక్షం వైసీపీ అంచనా వేస్తోంది. ఏది ఏమైనా రాజకీయాలు చాలా హాట్‌గా, చాలా కాస్ట్‌లీగానూ మారిపోయాయి.
ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బులు కావాలి. గెలవడానికి డబ్బులు కావాలి. గెలిచాక అధికారం నిలబెట్టుకోవడానికీ డబ్బులు కావాలి. ఎన్నికలకే పదివేల కోట్లు ఖర్చయితే, దాన్ని రాబట్టుకోవడానికి రాజకీయ నాయకులు పిల్లి మొగ్గలేయకుండా ఉంటారా.? జేసీ ఆవేదనలో అంత అర్ధముంది. రాజకీయాలు మారాలి. డబ్బు ప్రమేయం లేని రాజకీయం రావాలి. కానీ పిల్లి మెళ్లో గంట కట్టేదెవరు.?
