చిన్న చిత్రంగా సంక్రాంతికి విడుదలైన ‘హను-మాన్’ సినిమా భారీ విజయం సాధించి కంటెంట్ కు ఉన్న పవర్ ఏంటో చూపింది. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసీ సినిమా నేటితో 30రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఇప్పటికీ ధియేటర్లో సినిమా సందడి తగ్గలేదు. ఏకంగా దేశవ్యాప్తంగా 300 సెంటర్లలో రన్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద ‘హను-మాన్’ మూవీ రూ.300కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డు నెలకొల్పింది.
కొన్నేళ్ల సినిమా విజయాల తీరును పరిశీలిస్తే.. చిన్న సినిమాల్లో 30రోజుల్లో 300కోట్లు.. 300 సెంటర్లలో రన్ కావడం విశేషం. ‘హను-మాన్’తో విడుదలైన సినిమాలన్నీ ఓటీటీలోకి వచ్చేసినా ‘హను-మాన్’ మాత్రం తన హవా చూపిస్తూ ముందుకెళ్తోంది. మరో రెండు వారాలు ఇదే రన్ కొనసాగించి 50రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటుందనేది సినీ వర్గాల అంచనా. ‘హను-మాన్’ ఇచ్చిన సక్సెస్ తో దర్శకుడు ప్రశాంత్ వర్మ సీక్వెల్ గా ‘జై హనుమాన్’ తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో అంచనాలు భారీగా ఉన్నాయి.