తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ మహిళలకు తీపి కబురు అందించింది. నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి (డిసెంబర్ 9), తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా బాలికలు, మహిళలు.. అందరూ ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ట్రాన్స్‌జెండర్లకు సైతం ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా పల్లె వెలుగు మొదలుకుని ఎక్స్‌ప్రెస్ బస్సుల వరకు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల వరకు.. అన్నిట్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణమే. అంటే, ఇకపై ఎవరూ బస్ టిక్కెట్ కొనుగోలు చేయాల్సిన పనిలేదు.
నిజానికి, మహిళల కోణంలో చూస్తే, ఇది చాలా చాలా మంచి నిర్ణయమే. కానీ, ఆర్టీసీ సంస్థ కోణంలో చూస్తే, గుది బండ.. అని చెప్పక తప్పదు. జీరో టిక్కెటింగ్ పద్ధతి తీసుకొచ్చి, ఆర్టీసీకి ప్రభుత్వం నిధుల్ని సమకూర్చుతుందట. నిజమేనా.? ఈ పథకం ద్వారా ఏర్పడే లోటుని, ప్రభుత్వం భర్తీ చేస్తుందా.? అన్నది ముందు ముందు తేలుతుంది.
తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ తరహా పథకం అమల్లో వుంది. చెన్నయ్ సిటీలో అయితే, ఏ రాష్ట్ర మహిళ.. అని చూడరు. మహిళలందరికీ ఉచిత ప్రయాణమే.! తెలంగాణ రాష్ట్ర మహిళ.. అని ప్రూవ్ చేసుకోవడానికి, గుర్తింపు కార్డులు తప్పనిసరి అట. ముందు ముందు స్మార్ట్ కార్డుల్ని తెచ్చే యోచన ఆర్టీసీ చేస్తోందట కూడా.
వాస్తవానికి, ఆర్టీసీ పీకల్లోతు నష్టాల్లో వుంది. గతంలో ఆర్టీసీ సిబ్బంది ఆందోళనలు చేశారు, ధర్నాలు చేశారు.. చాలా చాలానే చేశారు. బంద్ కూడా జరిగింది. బస్సుల బంద్‌తో సంస్థ మరింత నష్టపోయింది. ఉద్యోగులూ నష్టపోయారు. ఆ నష్టాల నుంచి ఆర్టీసీ ఇంకా బయటకు రాలేదు.
మహిళలకేనా.? మగాళ్ళు ఏం పాపం చేశారని.? అన్న చర్చ కూడా తెరపైకొస్తోంది. మగాళ్ళ ఆవేదన ఇది.! ఇకనేం, మొత్తం అందరికీ ఉచితం చేసేస్తే పోలా.? అన్న వాదనా లేకపోలేదు. ఎవరి గోల వారిది.! ఒక్కటి మాత్రం నిజం. ప్రతి ఉచిత సంక్షేమ పథకం ప్రజల నెత్తిన మోయలేనంత ఆర్థిక భారాన్ని మోపుతుంది.! ఆ భారం సంగతి ముందు ముందు అనుభవమవుతుంది జనాలకి