ఏదో అనుకుంటే, ఇంకోటేదో అయ్యింది.! అసలు ఆ కేసులోనే అర్థం పర్థం లేదంటూ, మొత్తంగా కేసు కొట్టేయించే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు బొక్కబోర్లాపడుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ‘లోతు’ ఎంత.? అన్నది ముందు ముందు తేలుతుంది. కానీ, చంద్రబాబు బలహీనత మాత్రం ముందే బయటపడిపోతోంది.
తాను అరెస్టవుతాననే విషయం చంద్రబాబుకి ముందే తెలుసు. ఆ విషయం ముందే ఆయన చెప్పుకున్నారు కూడా. అలాంటప్పుడు, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించుకోవాలి కదా.? జైలుకెళ్ళి.. లేదంటే, వెళ్ళకుండానే కడిగిన ముత్యంలా అరెస్టు తర్వాత బయటకు వస్తాననుకున్నారు చంద్రబాబు.
కానీ, వ్యవహారం తేడా కొట్టేసింది. జైలుకు వెళ్ళక తప్పలేదు. వెళ్ళాక, జైలు నుంచి బయట పడే దారి కనిపించడంలేదు. క్వాష్ పిటిషన్ కొట్టివేయబడింది. పైగా, సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఒకే రోజు రెండు దెబ్బలు.. బ్యాక్ టు బ్యాక్.. ఈ దెబ్బల్ని తట్టుకోవడం చంద్రబాబుకి ఈ వయసులో అంత చిన్న విషయం కాదు.
ఇక ఇప్పట్లో చంద్రబాబు బయటకు వచ్చే అవకాశమే లేదని తెలుగు తమ్ముళ్ళు మానసికంగా సిద్ధమయిపోతున్నారు. ఎందుకంటే, ఆయన్ని మరిన్ని కేసుల్లో ఇరికించడానికి వైసీపీ పక్కా వ్యూహం సిద్ధం చేసుకుంది. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో, దర్యాప్తు సంస్థలు, చంద్రబాబుని కార్నర్ చేసేశాయ్.
ఈ రోజుల్లో ప్రభుత్వం తలచుకుంటే ఏదైనా జరుగుతుందనడానికి చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలే నిదర్శనం. బెయిల్ పిటిషన్ మూవ్ చేయడంలో అలసత్వం.. ఇంతలా కొంప ముంచిందన్నది మెజార్టీ తెలుగు తమ్ముళ్ళ ఆవేదన.
తప్పు జరిగిపోయింది.! సరిదిద్దుకోవడానికీ ఆస్కారం కనిపించడంలేదు. అరెస్టు.. ఇంకోసారి అరెస్టు.. ఆపై మరోసారి అరెస్టు.. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికలూ వచ్చి వెళ్ళిపోతాయేమో.!