కూతురి మరణాన్ని ఏ తండ్రి అయినా జీర్ణించుకోగలడా.? ఛాన్సే లేదు.! సినీ నటుడు, సంగీత దర్శకుడు, నిర్మాత విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె ఇటీవల బలవన్మరణానికి పాల్పడింది. ఆమె వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే.
విజయ్ ఆంటోనీ కుమార్తె మీరా, ధైర్యవంతురాలు. ఉన్నతమైన ఆలోచనలతో వుండేదిట. చదువుల్లో దిట్ట.. క్రీడలపైనా మక్కువ ఎక్కువే. ఆమె గురించి, పలువురు సినీ ప్రముఖులు గతంలోనే గొప్పగా చెబుతూ వచ్చారు. తన కూతుర్ని చూసి గర్విస్తున్నట్లు పలు సందర్భాల్లో విజయ్ చెప్పాడు.
ఏమయ్యిందోగానీ, అత్యంత కఠినమైన నిర్ణయం ఆమె తీసేసుకుంది, బలవన్మరణానికి పాల్పడింది. ‘నా కూతురు చనిపోయింది. నేనూ చనిపోయాను..’ అంటూ విజయ్ ఆంటోనీ, ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు సోషల్ మీడియాలో. ‘కులం, మతం, బాధ, అసూయ, పేదరికం, ద్వేషపూరిత వాతావరణం లేని ప్రశాంతమైన ప్రదేశానికి ఆమె వెళ్ళింది..’ అంటూ అందులో పేర్కొన్నాడు.
విజయ్ ఇలా ట్వీట్ చేయడానికి బలమైన కారణం ఏమైనా వుందా.? అని ఇప్పుడంతా ఆరా తీస్తున్నారు. నిజానికి, ఇది ఓ సగటు తండ్రి ఆవేదన. సెలబ్రిటీల పిల్లల మీద సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ కుళ్ళిన సమాజంలో, పసి పిల్లలు బతకడం అనేది కనాకష్టమైపోతోంది.
సోషల్ మీడియా పుణ్యమా అని పిల్లల్లోనూ, పెద్దల్లోనూ మానసిక ఒత్తిడి పెరిగిపోతోంది. ఉన్మాదుల్లా మారిపోయి, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తూ.. వున్నది లేనట్టు, లేనిది వున్నట్టు.. కట్టుకథలు సృష్టించే సోషల్ మీడియా.. అందునా, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు.. చాలా జీవితాల్ని ఛిద్రం చేసేస్తున్నాయి.
తన సినిమాల ద్వారా సభ్య సమాజానికి ఏదో ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికి ఎప్పుడూ తాపత్రయ పడే విజయ్ ఆంతోనీ, తన కుమార్తె మరణం నేపథ్యంలో చేసిన ట్వీట్ కూడా అలాంటిదే.